- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kurnool: జోరుగా ఈ-స్టాంపుల దందా?
దిశ ప్రతినిధి, కర్నూలు: గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-స్టాంపుల విధానం అటు దస్తావేజు లేఖర్లు, ఇటు మీసేవ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు, కౌలు రైతులు ఈ-స్టాంపుల కోసం పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ప్రజలు, రైతులతో స్నేహపూర్వకంగా మెలగాల్సిన స్టాంపు వెండర్లు, మీసేవ నిర్వాహకులు వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే తీసుకో.. లేకుంటే లేదంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి వారికే వత్తాసు పలకడం దురదృష్టకరం.
రూ.162 కోట్ల సాయం ఎగవేత
కర్నూలు జిల్లాలో 18,751 మంది రైతులు, నంద్యాల జిల్లాలో 22,742 మంది కౌలు రైతులున్నారు. వీరికి గత వైసీపీ ప్రభుత్వం సీసీఆర్సీ కార్డులు అందజేసింది. 2024-25లో ఉమ్మడి జిల్లాలో 50 వేల మంది కౌలు రైతులకు కార్డులివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2023-24లో ఉమ్మడి జిల్లాలో 41 వేల మంది కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు అందజేసింది. అందులో 17,996 మందికే రైతు భరోసా పెట్టుబడి సాయం అందింది. మూడు విడతల్లో 23 వేల మందికి పైగా కౌలు రైతులకు రూ.32.50 కోట్ల సాయం దూరం చేసింది. ఇలా ఐదేళ్లలో పరిశీలిస్తే రూ.162.50 కోట్ల సాయం అందకుండా పోయింది. కౌలు దారులకు పూచికత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. 2023-24లో 41 వేల మందికి రూ.220 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కర్నూలు జిల్లాలో రూ.123 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 376 మందికి రూ.2.44 కోట్లు మాత్రమే రుణాలిచ్చింది. నంద్యాల జిల్లాలో రూ.97 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 273 మందికి రూ.4.42 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. అయితే 2024లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం కౌలు రైతులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో భాగంగా రూ.20 వేలు ఇవ్వాలనే యోచనలో ఉంది. అందుకోసం కౌలు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్ లైన్ లో నమోదు చేసుకునేలా అవకాశం కల్పించింది. అందుకోసం కౌలు రైతులు ఆన్ లైన్ లో నమోదు కోసం ఇబ్బందులు పడుతున్నారు.
ఈ-స్టాంపు ఇక్కట్లు..
సాధారణంగా ప్రతి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో దస్తావేజులేఖర్ల వద్ద రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపు పత్రాలు లభించేవి. వీటిని వారు ఏ ధర ఉంటే ఆ ధరకే విక్రయించేవారు. కానీ గతేడాది వైసీపీ ప్రభుత్వం ఈ-స్టాంపు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొందరు దస్తావేజులేఖర్లు, మీసేవా కేంద్రాల్లో లభించేలా నిబంధనలు తీసుకొచ్చింది. ఈ విధానం దస్తావేజు లేఖర్లు, మీసేవ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రూ.10 స్టాంపు పత్రమైనా, రూ.20 స్టాంపు పత్రమైనా రూ.50లకు, రూ.50 స్టాంపు పత్రం రూ.100కు, అలాగే రూ.100 స్టాంపు పత్రం రూ.200కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇలా రెట్టింపు ధరలకు ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నిస్తే వారికి ఈ-స్టాంపు పత్రాలు లేవని, వేరేచోట తెచ్చుకోవాలని దురుసుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వీటికి ఇలా చెల్లిస్తే స్టాంపు పత్రాల్లో మేటర్ ను టైపు చేసేందుకు ఒక్కో స్టాంపు పత్రానికి రూ.80ల నుంచి 100లు తీసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇక గ్రామ రెవెన్యూ అధికారి ఒక ఎత్తు. మొదటి తతంగం పూర్తైన రైతులు ఆన్ లైన్‌లో నమోదు కోసం వీఆర్ఓలను ప్రసన్నం చేసుకోవాలి. లేకుంటే ఆన్ లైన్ లో నమోదు చేయడు. అందుకోసం ఒక్కో కౌలు రైతు రూ.500ల నుంచి వెయ్యి రూపాయల వరకు సమర్పించుకోవాల్సిందే. అవసరమైతే వారికి విందు, మందు కూడా సమర్పిస్తేనే కౌలు రైతు పేరు ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. లేకుంటే లేదు. వీటన్నిటికీ ఒక్కో కౌలు రైతుకు చార్జీలు, ఈ-స్టాంపు ఖర్చులు, టైపింగ్ ఖర్చులు, జిరాక్సులు, విందు, మందు కలిపి ఇలా ఒక్కో రైతుకు దాదాపు రూ.3 వేల నుంచి 4 వేలు ఖర్చు అవుతుంది. ఒకవేళ అన్నదాత సుఖీభవ కింద విడతల వారీగా డబ్బులు జమ అవుతాయి. లేకుంటే దరఖాస్తు రిజెక్ట్ అయితే మాత్రం డబ్బులు పడవు.
దీంతో రైతులు చేసిన ఖర్చంతా వృథా అవుతుంది. అందువల్ల అధికారులు స్పందించి ఇష్టానుసారంగా ఈ-స్టాంపుల అమ్మకాలు చేస్తున్న వారిపై, ఆన్ లైన్ లో నమోదు కోసం కౌలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీఆర్ఓలపై చర్యలు తీసుకుని ప్రజలు, కౌలు రైతులకు న్యాయం చేయాలని కౌలు రైతులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.