పల్లెలకు జ్వరం.. పలు గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం

by Anjali |   ( Updated:2024-08-31 03:14:48.0  )
పల్లెలకు జ్వరం.. పలు గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం
X

దిశ ప్రతినిధి, కర్నూలు: దేశానికి పట్టుకొమ్మలుగా భావించే పల్లెలకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా జ్వరం పట్టుకుంది. అతిసారా, డెంగీ వంటి రోగాలు అభం శుభం తెలియని అమాయకుల ఆయువు తీస్తున్నాయి. పచ్చగా, ఆరోగ్యంగా ఉండాల్సిన పల్లెలు పారిశుధ్య లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులకు సర్వాధికారాలు కల్పించి గ్రామాలకు నిధులు విడుదల చేసినా వైసీపీ సర్పంచులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు గ్రామాలు అనారోగ్యంతో మగ్గిపోతున్నాయి. వేంపెంట గ్రామంలో అతిసారాతో ఒకరు మృతి చెందగా 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక పాణ్యం నియోజకవర్గంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలు పట్టీ పీడిస్తున్నాయి.

నిధులు విడుదల చేసినా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజక వర్గాలు, 57 మండలాలు, 921 రెవెన్యూ గ్రామాలు, 993 పంచాయతీలున్నాయి. 40.52 లక్షల జనాభా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉండే గ్రామ పంచాయతీల సర్పంచులు, అధికారుల పుణ్యమాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినా వివిధ పనులు చేశామంటూ బిల్లులు రాసుకుని జేబులు నింపుకుంటున్నారు. ప్రస్తుతం అధిక శాతం వైసీపీకి చెందిన సర్పంచులు ఉండడంతో గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయకున్నా బిల్లులు మంజూరు చేసుకుని జేబులు నింపుకున్నారు. సర్పంచులు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయాల్సిన పంచాయతీ కార్యదర్శులు కూడా వారితో కుమ్మక్కై గ్రామ పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం, అస్తవ్యస్తమైన రహదారులు, మురుగు నీరు, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లతో నిండిన డ్రైనేజీలు దర్శనమిస్తున్నాయి.

రోగాలకు నిలయంగా మున్సిపాలిటీలు..

ఇక మున్సిపాలిటీల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అటు గ్రామాలు, ఇటు పట్టణాల్లో పారిశుధ్యం లోపించడంతో దోమలు వృద్ధి చెంది రోగాలకు నిలయంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థతో పంచాయతీ కార్యదర్శులు, కొందరు సచివాలయ ఉద్యోగులకు పని లేకుండా పోయింది. చాలా మంది గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులను అడ్మిన్లుగా నియమించడంతో వారికి ఎలాంటి పని లేకుండా పోయింది. ప్రస్తుతం చాలా మంది కార్యదర్శులు గ్రామ సచివాలయాలకు రావడంలేదు. దీంతో చాలా మంది పనులు కాక వెనుదిరుగుతున్నారు. కేవలం డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, ఉద్యాన, రైతుభరోసా కేంద్రాల్లోని సచివాలయ ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. అందులోను డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్, హార్టికల్చర్ సచివాలయ ఉద్యోగులకు తప్ప ఎవరికీ ఎలాంటి పని లేదు. ఇంజనీర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, ఇతర శాఖలకు చెందిన వారు కార్యాలయాలకు రావడం తప్ప ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తూ ఇళ్లకు వెళ్తున్నారు.

ఏఏ ప్రాంతాల్లో సమస్యలున్నాయంటే..

- నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో గ్రామంలో తాగునీటి పైప్ లైన్లు లీకు కావడంతో గ్రామస్తులు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వీరేచనాలతో 20 మందికి పైగా రోగులు మంచం పట్టారు. చికిత్స పొందుతూ బోయ రామలక్ష్మి (70) అనే వృద్ధురాలు కోలుకోలేక మృతి చెందారు. పరిస్థితి సీరియస్ గా ఉందన్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటరమణ వైద్య బృందంతో గ్రామానికి చేరుకొని అక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కొందరి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు, వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. అత్యవసర కేసుల కోసం రెండు 108 వాహనాలను గ్రామంలో ఉంచారు.

* పాణ్యం సామాజిక ఆరోగ్య కేంద్రంలో జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 350 నుంచి 450 వరకు జ్వరాలు, టైఫాయిడ్, జ్వరం వంటి కేసులు నమోదు అవుతున్నాయి. కానీ అధికారులు వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట.

* నెలన్నర క్రితం మంత్రాయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారాతో బాలుడు మృతి చెందగా 40 మంది అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వైద్యాధికారులు గ్రామానికి చేరుకుని బాధితులను ఆదోని, కోసిగి, కల్లుదేవకుంట, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్సలు చేయించారు.

* గతేడాది సెప్టెంబర్ లో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామంలో వడ్డె కాలనీకి చెందిన మేక వెంకటేశ్వర్లు రెండో కుమార్తె అవంతి అనే (11) ఏళ్ల బాలిక డెంగ్యూ లక్షణాలతో మృతి చెందింది. అలాగే ఎస్సీ కాలనీకి చెందిన గోరంట్ల చిన్నాకు ఇద్దరు కుమారులు డెంగ్యూ లక్షణాలతో కర్నూలులో చికిత్స పొందారు. ఇలా ఈ గ్రామంతో పాటు ముసలిమడుగు, మాడుగుల, కొక్కెరంచ, తదితర గ్రామాలతో పాటు మండలంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే దర్శనమిచ్చాయి. వీటితో పాటు ఆత్మకూరు, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ వంటి మున్సిపాల్టీల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed