Ap News: నిన్న నేతలు.. నేడు అనుచరులు.. మైలవరం వైసీపీలో ఆగని చిచ్చు

by srinivas |
Ap News: నిన్న నేతలు.. నేడు అనుచరులు.. మైలవరం వైసీపీలో ఆగని చిచ్చు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న మొన్నటి వరకు మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన వేలు పెట్టేవారు. దాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే తట్టుకోలేకపోయేవారు. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్లు ఎమ్మెల్యే తనదైన స్టైల్‌లో మంత్రికి వార్నింగ్‌లు ఇచ్చారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇరువురుని శాంతించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అంతా సర్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఆ నేతల అనుచరులు తెరపైకి వచ్చారు. మా బాస్‌ను అంతమాట అంటావా.. లేదు మా బాస్‌ను నువ్వంత మాట అంటావా అంటూ ఇరువురు ఫోన్‌లలో రెచ్చిపోయారు. ప్రస్తుతం మంత్రి అనుచరుడు, ఎమ్మెల్యే అనుచరుడి మధ్య బూతుపురాణం సోషల్ మీడియాలో రోత పుట్టిస్తోంది. నేతలు పేర్లు పెట్టుకుని మరీ తిట్టుకున్నారు. నేతలు మారినా కార్యకర్తల తీరు మాత్రం మారకపోవడంతో నియోజవర్గం వైసీపీలో గందరగోళం నెలకొంది.

సర్దుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు

ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం పట్టుకోసం అటు వసంత కృష్ణప్రసాద్, ఇటు మంత్రి జోగి రమేశ్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంది. మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు వారసుడిగా కృష్ణప్రసాద్ రాజకీయ ఆరంగేట్రం చేసి 2019 ఎన్నికల్లో మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను మట్టికరిపించి ఘన విజయం సాధించారు. వైసీపీలో దూకుడుగా వ్యవహరించారు. అనంతరం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలో జోగి రమేశ్ వర్గీయుల ఆధిపత్యపోరు పెరిగిపోయింది. ప్రతీదాంట్లో మంత్రి జోగి రమేశ్ తోపాటు ఆయన అనుచరులు వేలుపెట్టడంతో ఎమ్మెల్యే వసంత తట్టుకోలేకపోతున్నారు.

అయితే ఇదంతా మైలవరం అసెంబ్లీ నియోజక వర్గంపై మంత్రి జోగి రమేష్ కన్నేశారని 2024 ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో గందరగోళం సృష్టిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ వ్యవహారం కాస్తా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన సీఎం జగన్ ఇరువురితో వేర్వేరుగా భేటీ అయ్యారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యే కలిసి పని చేసుకుంటారని అంతా భావించారు. అంతేకాదు ఇటీవలే ఓ వేడుకలో మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సైతం పాల్గొనడంతో నియోజకవర్గం వైసీపీలో ఎలాంటి అలజడులు లేవని అనుకున్నారు

రోత పుట్టిస్తున్న ఆడియో

మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ల మధ్య ఇక రాజకీయ పోరు నడవదని అంతా అనుకుంటున్న తరుణంలో వారి అనుచరులు తెరపైకి వచ్చారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. తేల్చుకుందాం రా అంటూ ఫోన్‌లలో సవాళ్లు విసురుకున్నారు. అంతేకాదు బూతులతో విరుచుకుపడ్డారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తిగతంగా అమరావతికే నా మద్దతు అని ప్రకటించారు. అయితే ఓ ప్రముఖ పేపర్‌లో వచ్చిన వార్తను కట్ చేసి సోషల్ మీడియాలో మంత్రి జోగి రమేశ్ అనుచరుడు సుబ్బారావు పోస్ట్ చేశారు. పార్టీలో ఉంటే ఉండు పోతే పో ఎవరు ఉండమన్నారు అంటూ ట్యాగ్ చేశారు. ఇది వివాదానికి కారణమైంది. ఈ పోస్ట్ చూసిన మైలవరం నియోజకవర్గం జి కొండూరు మాజీ జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య, ఇబ్రహీంపట్నం వైసీపీ బీసీ నాయకుడు సుబ్బారావుకు నేరుగా ఫోన్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బండబూతులు తిట్టుకున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడిస్తే దాన్ని పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే ఉండు పోతే పో అని ఎలా అంటావా అని ప్రశ్నించారు. వైసీపీలో ఏమైనా ఉంటే అధినేత సీఎం జగన్ చూసుకుంటారు మీకెందుకు అని ప్రశ్నించారు. అనంతరం ఇరువురు ఒకరిపై ఒకరు బూతులతో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తేల్చుకుందాం రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరు నేతలు తిట్టుకున్న బూతులు రోత పుట్టిస్తు్న్నాయి.

ఫోకస్ పెట్టకపోతే ప్రమాదమే

మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అనుచరుల ఆడియోపై నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అంతర్గత వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతుందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమస్యను పరిష్కరించినా షరా మామూలుగానే ఉందని చెప్పుకుంటున్నారు. ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి వైసీపీ అధిష్టానం ముగింపు పలకాలని లేని పక్షంలో వైసీపీకి పరాభవం ఎదురయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story