Cm Jaganకు లెఫ్ట్ పార్టీల డెడ్ లైన్.. ధర్నాలకు పిలుపు

by srinivas |
Cm Jaganకు లెఫ్ట్ పార్టీల డెడ్ లైన్.. ధర్నాలకు పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగ, ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు మానుకోవాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని వాపమక్షాలు స్పష్టం చేశాయి.

ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతుగా మార్చి 9,10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తు్న్నట్లు వామపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఏడాది కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల ఇప్పటికీ 60 శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదని విమర్శించారు. ఇక డీఏల బకాయిల సంగతి అలానే ఉందని ఎద్దేవా చేశారు.

మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నారని షోకాజ్‌ నోటీసులు జారీ చేయడంపై వామపక్ష నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన కక్ష సాధింపు ధోరణిని విడనాడి సీపీఎస్‌ రద్దుతో సహా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నింటిని తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురి చేయటాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story