- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YCP: మాజీ మంత్రికి ఈ సారి టికెట్ డౌటేనా?
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడటంలో ఆయనకు మరెవరూ సాటి రారు. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట ఛాన్స్ దొరికితే చాలు విపక్షాలపై యుద్ధానికి దిగుతారు. తనదైన శైలిలో మాటల తూటాలతో విరుచుకుపడుతుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల పేరు వినబడితే చాలు ఒంటికాలిపై లేచేస్తారు. మంత్రిగా ఉన్నా, మాజీమంత్రిగా ఉన్నా ఆయన రీతిలో ఎలాంటి మార్పు రాలేదు. విమర్శల దాడిలో సెగ కూడా ఏమీ తగ్గలేదు. విపక్ష నేతలపై ఎలా అయితే విరుచుకుపడతారో అంతేస్థాయిలో అధికార పార్టీ నేతలపైనా విరుచుకుపడతారు. నువ్వేమైనా తోపువా అంటూ ఘాటు విమర్శలు చేస్తారు. ఇంతకీ ఆ మాజీమంత్రి ఎవరో తెలిసే ఉంటుంది కదూ ఇంకెవరు వెల్లంపల్లి శ్రీనివాసరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్‌లలో వెల్లంపల్లి ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా..వైసీపీ పైనా ఎవరైనా విమర్శలు చేస్తే చాలు ఇక ఆగమేఘాల మీద మీడియా ఎదుట వాలిపోతారు. విమర్శలు చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చేవరకు నిద్రపోరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు నియోజకవర్గంలో ఎదురీత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అనేక సర్వేలు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు అనుకూలంగా లేవని తెలుస్తోంది. అంతేకాదు నియోజకవర్గానికి చెందిన మైనారిటీలు సైతం వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో అసమ్మతిపోరుతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.
మైనారిటీల సెగ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో ఉన్న బలమైన నాయకులలో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఒకరు. అంతేకాదు విపక్షాలపై విరుచుకుపడే నేతలలో....వైసీపీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే నేతలలో వెల్లంపల్లి శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు జనసేనాని పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడే నాయకులలో టాప్ టెన్‌లో వెల్లంపల్లి చోటు దక్కించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్వాలిఫికేషన్సే జగన్ ఫస్ట్ కేబినెట్‌లోనే చోటు దక్కించుకోవడానికి కారణమైంది అనడంలో ఎలాంటి అనుమానమే అక్కర్లేదు. మూడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలుగొందారు. మాజీమంత్రి అయిన తర్వాత కాస్త ఇమేజ్ తగ్గినప్పటికీ తమ విమర్శలలో వేడి మాత్రం తగ్గలేదు. అయితే నియోజకవర్గంలో ఆయనకు అసమ్మతి వర్గం తయారైనట్లు తెలుస్తోంది. నాడు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే టికెట్ ఇవ్వొద్దంటూ నివేదికలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు ఐప్యాక్ టీమ్ సైతం నెగిటివ్‌గా ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు ఓటములను డిసైడ్ చేసేది ముస్లింమైనారిటీలే. రెండు లక్షల 20వేల ఓటర్లు ఉంటే వారిలో 60 వేలకు పైగా ఓట్లు ముస్లిం మైనారిటీలవే. 2014 ఎన్నికల్లో వైసీపీ ఈ సీటును ముస్లింలకే కేటాయించిన వైసీపీ 2019లో వెల్లంపల్లికి కేటాయించగా ఆయన గెలుపొందారు. అయితే గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ నేతలకు, వెల్లంపల్లి శ్రీనివాసరావుకు గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వెల్లబుచ్చుతున్నట్లు తెలుస్తోంది.
ఆసిఫ్ వర్గం గుర్రు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం మైనారిటీలు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజక వర్గానికి చెందిన తమను కాదని టీడీపీ హయాంలో జలీల్‌ఖాన్‌తో సన్నిహితంగా ఉన్న వక్ఫ్‌బోర్డ్ మెంబర్, సెంట్రల్ నియోజకవర్గ నాయకుడు రుహుల్లాకి వెల్లంపల్లి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెల్లంపల్లిని ఎంతో కష్టపడి గెలిపించామని అయితే ఆయన తీరులో మార్పు రావడంతో వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. పశ్చిమ నియోజకవర్గానికే చెందిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ వర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఇందుకోసమే వచ్చే ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో చీలికలు తీసుకువస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వైసీపీలో వర్గాలను పెంచి పోషిస్తున్నారని ఫలితంగా వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లికి టికెట్ ఇవ్వొద్దని పలువురు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అధిష్టానానికి ఫిర్యాదులు
విపక్షాలపై విరుచుకుపడే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు విమర్శించేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోని వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈసారి ఎన్ని అవకాశాలు వచ్చినా పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సైతం కారణాలు లేకపోలేదని తెలుస్తోంది. అటు పవన్ కల్యాణ్ ఇటు చంద్రబాబు మరోవైపు నారా లోకేశ్‌లపై విమర్శలు చేసే వెల్లంపల్లిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు సర్వేలలో తేలింది. అంతేకాదు విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధిపత్యం ఇంకా తగ్గలేదని దీంతో వైసీపీలోని ఓ వర్గం అక్కసు వెళ్లగక్కుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై వరుస ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని రోజులు మౌనం వహించడం మంచిదని వైసీపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.
స్థానిక నాయకులతో విభేదాలు
మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో వెల్లంపల్లికి పొసగలేదని తెలుస్తోంది. అంతేకాదు విజయవాడ వైసీపీ నాయకులతోనూ విభేదాలు ఉన్నాయి. ఇదే సమయంలో జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉదయభాను హాజరయ్యారు. ఆయనను చూసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం వద్దకు తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌ను తీసుకెళ్లటానికి నువ్వు ఎవరు? పోటుగాడివా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి ఉదయభాను సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నేను పార్టీలో సీనియర్‌ను. నీలా పదవి కోసం పార్టీ మారలేదు. మూడు పార్టీలు మారిన ఊసరవెల్లివి నువ్వు.. నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ వెల్లంపల్లి శ్రీనివాసరావు సీటుకు ఎసరు తీసుకువచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావుకు టికెట్ దక్కుతుందా లేక వేరొకరికి దక్కుతుందా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి: ఏపీలో విపక్షాలకు చుక్కలు చూపిస్తోన్న బోల్డ్ బ్యూటీ!