AP Government:ధరల నియంత్రణ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-26 09:50:21.0  )
AP Government:ధరల నియంత్రణ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ధరల నియంత్రణకు సర్కారు కళ్లెం వేయనుంది. ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్‌పై మంత్రుల కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రుల కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.

అధ్యయనం చేయాలి..

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకస్మికంగా ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ధరల పెరుగుదల, నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై అధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేయాలని సూచించింది. నిత్యావసరాలు, కూరగాయల ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపైనా సిఫార్సులు చేయాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఉత్పత్తి, సప్లై, డిమాండ్, ధరలకు సంబంధించిన అంశాలు, పంటల తీరు, ఎగుమతులు, దిగుమతుల పై కూడా అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు, కూరగాయలు లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని తెలిపింది.

సమగ్ర నివేదిక ఇవ్వాలి..

ఆహార పంటలు, నిత్యావసరాలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరా, నిల్వలకు సంబంధించి దీర్ఘ, స్వల్పకాలిక ప్రణాళికల అమలుపై ప్రభుత్వం సిఫార్సులు కోరింది. ఉత్పత్తి, నిల్వల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఏడాది పొడవునా ధరలు నియంత్రణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయదారులు, మిల్లర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, వంటనూనె డీలర్లు, ఎగుమతి, దిగుమతి దారులతో సమావేశం కావాలని ఆదేశించింది. అధ్యయనం అనంతరం తదుపరి నిర్ణయం కోసం సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ధరలు నియంత్రణలోకి తెచ్చేందుకు అవసరమైన యంత్రాంగం రూపకల్పనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed