టీడీపీతో కేసీఆర్​ పొత్తు? స్పందించని చంద్రబాబు!!

by Anjali |   ( Updated:2023-04-11 13:49:35.0  )
టీడీపీతో కేసీఆర్​ పొత్తు? స్పందించని చంద్రబాబు!!
X

రాజకీయాల్లో ఊహించని పరిణామాలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఓ సంచలనానికి బీఆర్‌ఎస్ ​అధినేత కేసీఆర్ ​కేంద్ర బిందువు అవుతున్నారు. చంద్రబాబుతో కేసీఆర్​ పొత్తు గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరు. ఆయా పరిస్థితులను బట్టి బంధాలు మారిపోతుంటాయి. ఓవైపు బీజేపీతో జట్టు కట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ఇంకోవైపు చంద్రబాబును తన వైపు మళ్లించుకోవాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేయడంలో చంద్రబాబుకు ఉన్న అనుభవాన్ని తనకు అనుకూలంగా మల్చుకోవాలని కేసీఆర్​భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్​వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ వర్గాల నుంచి స్పందన లేదు.

దిశ, ఏపీ బ్యూరో: టీఆర్ఎస్​ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంటును వదిలేశారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ ​అనేక ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. మమతా బెనర్జీ, నితీశ్​కుమార్, అఖిలేష్​యాదవ్, తేజస్వి యాదవ్​ లాంటి వాళ్లతో కలిసి కూటమి కట్టాలనుకున్న కేసీఆర్ ​ఆశలు ఫలించలేదు. ఇప్పటిదాకా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఒక్కరే కేసీఆర్‌తో కలిసి అడుగులేస్తున్నారు. ఏపీలో సీఎం జగన్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నా రాజకీయంగా ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దల అడుగుజాడల్లో నడుస్తున్నారు. అందువల్ల జగన్‌తో ప్రయోజనం లేదనుకొని చంద్రబాబుతో కలిసి పయనించాలని కేసీఆర్ ​భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్ ​వర్గాల నుంచి వినిపిస్తోంది.

చంద్రబాబుతో కేసీఆర్‌కు సాన్నిహిత్యం

గతంలో కేసీఆర్​ చంద్రబాబుతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. చంద్రబాబుతో సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవడం కేసీఆర్‌కు పెద్ద పనేం కాదు. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సానుకూలత లేదు. అసలు కేసీఆర్, చంద్రబాబు కలవడమేంటీ? ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసే వాళ్లున్నారు. ప్రస్తుతం రెండు పార్టీలు ఈ దఫా ఎన్నికల్లో తమ ప్రతాపాన్ని చూపడానికి కలిసి సాగాలను కోవడం వెనుక పరస్పర అవసరాలున్నాయి. కేసీఆర్, చంద్రబాబు కలిస్తే తెలంగాణలో దాదాపు 30 నుంచి 40 సీట్లలో ప్రభావం చూపగలరు. ప్రత్యేకించి హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణలో టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్ణాటకలోని తెలుగు వాళ్లలోనూ టీడీపీకి పలుకుబడి ఉంది. దాన్ని ఉపయోగించుకొని బీఆర్‌ఎస్, జనతాదళ్​ఎస్​ బలం పెంచుకోవాలనుకుంటున్నాయి. ఇక ఏపీలో చంద్రబాబుకూ ప్రయోజనం కలిగేలా కేసీఆర్​ వ్యూహం అమలు చేయాలనుకుంటున్నట్లు బీఆర్‌ఎస్​ వర్గాల నుంచి సమాచారం.

ఏపీలో బీఆర్ఎస్ ఉనికిలోకి తెచ్చేందుకు వ్యూహం

విశాఖ స్టీల్​ప్లాంటును తెగనమ్మాలని కేంద్రం ఉవ్విళ్లూరుతోంది. దీన్ని వెనక్కి కొడుతూ తెలంగాణ సర్కారు‌ స్టీల్‌ప్లాంటుకు కొంత నిధులు సమకూర్చి ఆ సంస్థ ఉత్పత్తులను కొనేట్లు ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా ఏపీలో బీఆర్‌ఎస్ ఉనికిని చాటుకోవడంతో పాటు టీడీపీకి ఉత్తరాంధ్రలో ప్రయోజనం చేకూరే వ్యూహాన్ని అమలు చేస్తుందంటున్నారు. టీడీపీతో బంధం పెంచుకునేందుకు ఇటీవల కేసీఆర్ ఎన్టీఆర్ ​జయంతికి నివాళులర్పించారు. మంత్రి కేటీఆర్​ సైతం చంద్రబాబు సామర్థ్యం గురించి అక్కడక్కడా ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ టీడీపీ బీజేపీతో కలిసి వెళ్లాలనే ఆలోచనను విరమించుకుంటే తప్ప సాధ్యం కాదు. రానున్న ఎన్నికల్లో ఏపీలో గెలవడమే టీడీపీ లక్ష్యం. అందుకోసమే బీజేపీతో కలిసి సాగాలనుకుంటోంది. బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్‌తో కలిసి ముందుకెళ్తే ఒనగూడే ప్రయోజనాలపై టీడీపీ వర్గాల్లోనూ ఆలోచన రేకెత్తిస్తోంది.

వామపక్షాల నుంచి మద్దతు లభించే అవకాశం

రాష్ట్రంలో కేసీఆర్​ టీడీపీకి అనుకూలంగా వ్యూహాలు అమలు చేస్తే అందుకు వామపక్షాల నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలున్నాయి. ఈపాటికే తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు కేసీఆర్‌కు దగ్గరయ్యాయి. జనసేనాని పవన్​ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమలో కేసీఆర్​ ఎత్తుగడలతో జనసేనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. కాపు సామాజిక వర్గంపై ప్రభావం చూపొచ్చు. అందువల్ల జనసేనాని బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తారా? లేక టీడీపీతో ముందుకు సాగుతారా? అనే స్పష్టతకు రాలేదు. ఈలోగా కేసీఆర్​ వ్యూహాలు జనసేనపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇది కూడా చంద్రబాబుకు ప్లస్​ కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read..

జనసేన పార్టీ ఎందుకో పవన్‌కే తెలీదు.. మంత్రి అంబటి రాంబాబు

Advertisement

Next Story

Most Viewed