కర్నూల్‌లో ఫలించిన కన్నడ మంత్రుల రాజ‘కీ’యం.. వైసీపీ కీలక నేతకు టికెట్ కన్ఫామ్

by Satheesh |   ( Updated:2024-01-12 05:23:51.0  )
కర్నూల్‌లో ఫలించిన కన్నడ మంత్రుల రాజ‘కీ’యం.. వైసీపీ కీలక నేతకు టికెట్ కన్ఫామ్
X

దిశ, కర్నూలు ప్రతినిధి: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీలో కన్నడ మంత్రుల రాజ‘కీ’యం ఫలించింది. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరుకు వైసీపీ మొదటి రెండు దఫా జాబితాల్లో పేరు లేకపోవడం, ఈ సారి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కూడా ఇవ్వరనే వార్తలు విన్పించాయి. దీంతో డైలామాలో పడ్డ మంత్రి గుమ్మనూరు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విషయం కర్నాటక మంత్రుల దృష్టికి వెళ్లడం.. అక్కడి నుంచి రాజకీయం నడపడంతో వారి ప్రయత్నాలు ఫలించి గుమ్మనూరుకు సీటు దక్కేలా చేశాయి. అలాగే కోడుమూరులో సిట్టింగ్‌ను కాదని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్‌కు, ఆలూరుకు చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షికి కేటాయిస్తూ వైసీపీ మూడో జాబితా ప్రకటించింది. అయితే మరో ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరు, నంద్యాల ఎంపీ సీటు విషయాలను పెండింగ్‌లో ఉంచి నేతల్లో మరింత టెన్షన్ పెంచారు.

ఉత్కంఠకు తెర..

ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీలో నెలకొన్న ఉత్కంఠకు అధిష్టానం మూడో జాబితా ప్రకటనతో తెరదించింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అదే తరహా వ్యూహానికి పూనుకున్నారు. ఏపీ వ్యాప్తంగా వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానంలో కొత్త వారికి సీట్లు కేటాయించేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రకటించిన జాబితాలో 38 మందిని నియమించారు. అందులో 12 మంది సిట్టింగ్‌లకు సీట్లు కేటాయించకుండా మొండిచేయి చూపారు. అలాగే మూడో జాబితాలో తమ పేర్లు ఉంటాయో ఉండవోననే నేతలు టెన్షన్ పడ్డారు.

రంగంలోకి కర్ణాటక నేతలు..

తనకు సీటు రాదని భావించిన మంత్రి గుమ్మనూరు జయరాం తమదైన శైలిలో చక్రం తిప్పారు. సీటు కోసం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్నాటక మంత్రి, గుమ్మనూరు సోదరుడు నాగేంద్రలు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు తమ రాజకీయ ప్రభావంతో మూడో జాబితాతో సీటు ఉండేలా చేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీ మధుసూదన్‌కు సీటు కేటాయిస్తారనే ప్రచారం ఉండగా ఆయనకే సీటు కేటాయించాలని కర్నాటకకు చెందిన మాజీ మంత్రి శ్రీరాములు తమవంతు ప్రయత్నాలు చేశారు.

అంతిమంగా గుమ్మనూరుకు సీటు ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే అందులో కొందరు సిట్టింగ్‌లకు మొండి చేయి చూపగా మరికొంత మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. గురువారం ప్రకటించిన మూడో జాబితాలో కర్నూలు ఎంపీ స్థానానికి మంత్రి గుమ్మనూరు జయరాంను, ఆలూరు నియోజకవర్గ ఇంచార్జిగా చిప్పగిరి జెడ్పీటీసీ విరుపాక్షిని, కోడుమూరుకు డాక్టర్ ఆదిమూలపు సతీష్ పేర్లను ఖరారు చేస్తూ జాబితా ప్రకటించారు.

తనకు సీటు రాదని, తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదని తీవ్ర మనస్థాపానికి లోనైన కర్నూలు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే తరహాలో మరో ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. మూడో జాబితా నేపథ్యంలో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు?, వైసీపీలోనే కొనసాగుతారా?, లేక ఇతర పార్టీలోకి వెళతారా? అన్న విషయాలపై స్పష్టత రాలేదు. పార్టీ కోసం పని చేసిన తనకు కాకుండా ఇతరులకు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే సుధాకర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

నందికొట్కూరుపై ఉత్కంఠ..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన నందికొట్కూరు సెగ్మెంట్‌పై ఉత్కంఠ నెలకొంది. మూడో జాబితాలో అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని అందరూ భావించారు. కానీ నందికొట్కూరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అభ్యర్థుల విషయంలో వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌కు, నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల మధ్య వర్గ పోరు నడుస్తోంది.

ఈ నేపథ్యంలో పేరుకు ఎమ్మె్ల్యే అయినా పెత్తనమంతా బైరెడ్డిది కావడంతో ఈ సారి తనకు సీటు కేటాయించాల్సి వస్తే బైరెడ్డి పెత్తనం ఉండకూడదని ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ఆయనను కాదని గెలవడం కష్టమని, ఆయనతో సఖ్యతగా ఉండి కలిసి ముందుకెళ్లాలని వైసీపీ అధినేతతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు ఆర్థర్‌కు చెప్పారు. కానీ వారి మధ్య సయోద్య కుదరకపోవడంతో అభ్యర్థిని మార్చేందుకే మొగ్గు చూపారు.

అనూహ్యంగా.. ఆనంద్..

మొదట కడపకు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ పేరు విన్పించగా ఆ తర్వాత అనూహ్యంగా కస్టమ్స్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ పేరు తెరపైకొచ్చింది. అలాగే మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి కూడా సీటు ఆశించేవారిలో ఉన్నారు. వీరిలో అధిష్టానం ఎవరికి సీటు కట్టబెడుతుందో తెలియాల్సి ఉంది. ఇక నంద్యాల ఎంపీ సీటు విషయంలో మొదటగా సినీ నటుడు అలీ పేరు విన్పించగా ఈయనకు గుంటూరు నుంచి పోటీ చేసేలా చర్చిస్తున్నట్లు సమాచారం. నంద్యాల ఎంపీ సీటు యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇవ్వనున్నారనే ప్రచారం జోరందుకుంది. అది ఎంత వరకు నిజమనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story