టికెట్ ఇస్తార..? సచ్చిపొమ్మంటారా..? జనసేన పార్టీ ఇంచార్జ్ ఆమరణదీక్ష..

by Indraja |
టికెట్ ఇస్తార..? సచ్చిపొమ్మంటారా..? జనసేన పార్టీ ఇంచార్జ్ ఆమరణదీక్ష..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు సీట్ల కేటాయింపు విషయంలో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలలు పట్టుకుంటుంటే.. మరో వైపు పార్టీ టికెట్ ఇవ్వలేదని దీక్షలు చేపడుతూ జనసేనానికి తలనొప్పిగా మారుతున్నారు కొందరు జనసైనికులు.

దీనితో ముందే ముక్కిడిగా ఉంటె పైన దగ్గు పడిశం అన్నట్లుగా మారింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఇక తూర్పు గోదావరి జిల్లా లోని జగ్గంపేట నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నారు అనడానికి.. జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చర్యలు అద్దంపడుతున్నాయి. నిన్న జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థిగా జోతిర్ల నెహురు పేరును చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు.

దీనితో ఆగ్రహానికి లోనైన జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర.. నిన్న సాయంత్రం అంతిమయాత్ర అని ఒక పాదయాత్రను నిర్వహించారు. అనంతరం గోపవరం మండలంలోని కనకదుర్గా ఆలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్నటి నుండి ఆహరం తీసుకోవడం పూర్తిగా మానేసి.. మంచి నీళ్లు మాత్రమే తాగుతున్నట్లు వెల్లడించారు.

అలానే ప్రస్తుత వ్యవస్థను బాగుచేయడం పవన్ కళ్యాణ్ చేతుల్లో లేదని పేర్కొన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించి టీడీపీని గెలిపించాలని జనసైనికులను కోరుతున్నట్లు తెలిపారు. రబ్బరు చెప్పుల రాజకీయం ఈ వ్యవస్థలో కుదరదని ఆవేదన వ్యక్తం చేశారు. 800 రోజుల నుండి తాను పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో జనసేన పార్టీ కోసం పని చేశానని.. అయినా తన నాయకుడు తనని గుర్తించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు తాము సిద్ధంగా లేమని.. జగ్గంపేట ఇంచార్జ్ గా పాటంశెట్టి సూర్యచంద్రని ప్రకటించాలని బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని జనసేన కార్యకర్తలు తెలియచేస్తున్నారు.

Advertisement

Next Story