చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు.. పవన్ కల్యాణ్ సీరియస్

by GSrikanth |   ( Updated:2023-02-18 07:39:53.0  )
చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు.. పవన్ కల్యాణ్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బలభద్రపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం చూస్తుంటే ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియజేస్తోందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా చంద్రబాబు పర్యటనకు వెళ్తే అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూశాం గానీ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఇలా రోడ్డుపై కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే రోడ్డుకు అడ్డంగా కూర్చోవడం చేస్తున్నారంటే వారి పట్ల ప్రభుత్వం ఒత్తిడి ఎంతలా ఉందో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనలాంటి మాటలకు అర్థం తెలియదని విమర్శించారు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏమాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని ఈ ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ఉన్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తిలో పోలీసులు ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయి అని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

నాడు విశాఖలో...

జనవాణి కార్యక్రమం కోసం తాను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పేసి హోటల్ గదిలో ఏవిధంగా బంధించారో రాష్ట్ర ప్రజలు చూశారని పవన్ గుర్తు చేశారు. ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పలకరించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారు. నడుస్తుంటే నడవకూడదని ఆంక్షలు పెట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని అర్థమవుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే ఈ పాలకులకు జీర్ణం కావడం లేదు. ప్రజా స్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం, భావక ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని ఈ పాలకులు తెలుసుకోవాలి అని పవన్ కల్యాణ్ హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed