చిన్నప్పుడు వంగవీటి రంగాకు టీ ఇచ్చా: ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-03-14 17:33:50.0  )
Janasena chief Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భవించిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలిపారు. మచిలీపట్నంలో జరుగుతోన్న జనసేన 10వ ఆవిర్భావ సభలో మంగళవారం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను పార్టీ పెట్టినప్పుడు నా వెనుక ఎవరు లేరని.. కానీ మీ అభిమానమే నాకు ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు రాజకీయాలంటే తెలియదని.. సగటు మనిషికి మేలు చేయాలన్నదే తన తపన అని పేర్కొన్నారు. తనకు పింగళి వెంకయ్య స్ఫూర్తి అని ఈ సందర్భంగా పవన్ తెలిపారు.

ఎంతో మంది పార్టీలు పెట్టి వదిలేశారని.. కానీ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా ప్రజల కోసం రాజకీయాల్లో నిలబడ్డానని చెప్పారు. జనసేన పార్టీకి పులివెందుల సహ అన్ని చోట్ల క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారన్నారు. అలాగే తెలంగాణలో జనసేనకు 30 వేల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారన్నారని చెప్పారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలబడాలంటే ధర్మాన్ని నిలబెట్టాలని.. అదే జనసేన పార్టీని నిలబెడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీ స్థాపించేటప్పుడు 7 సిద్ధాంతాలు ప్రతిపాదించామని.. అలాగే రాజకీయ అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామన్నారు. కులాలను కలపడమే తన అభిమతమని.. కులాల గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. కమ్మ, కాపు, దళితులు అని మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడినన్నారు. ఏపీ ప్రభుత్వం కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాపు కులంలో పుట్టినా అందరికి అండగా నిలవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. కానీ తాను కులాన్ని అమ్మేస్తానని కొందరు అంటుంటే బాధేస్తుందన్నారు.

తాను అమ్ముడుపోతానంటే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు. డబ్బులకు ఆశపడే వ్యక్తిని తాను కాదని.. కావలంటే నేనే డబ్బు ఇస్తానని అన్నారు. సినిమాకు తాను రోజుకు రెండు కోట్లు తీసుకుంటానని.. అలాంటి నన్ను డబ్బుతో కొనగలరా.. నేను అమ్ముడుపోతానా అని ప్రశ్నించారు. యువత కులాల ఉచ్చులో పడకూడదని ఈ సందర్భంగా పవన్ సూచించారు. తనకు వంగవీటి రంగ అంటే చిన్నప్పటి నుండి గౌరవమని.. చిన్నప్పుడు మా ఇంట్లో వంగవీటి రంగాకు టీ ఇచ్చానని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని కులాల్లో వెనుకబాటును పొగట్టడమే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed