పేదరికానికి స్వస్తి పలకడమే జగన్ లక్ష్యం: వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి

by Disha News Desk |
పేదరికానికి స్వస్తి పలకడమే జగన్ లక్ష్యం: వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన, త్యాగాలు చేసిన మహనీయులను అంతా ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్య్ర ఫలితాలు ప్రజలందరూ సమానంగా అనుభవించాలనే దిశగా ప్రతి చిన్న విషయాన్ని విపులంగా రాజ్యాంగంలో తెలియచేశారని చెప్పుకొచ్చారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా మనుషులందరూ సమానమే. స్వాతంత్య్ర దేశంలో అందరికీ పుట్టే హక్కు ఎలా ఉందో.. జీవించే హక్కు అలాగే ఉంటుంది.

అందరూ సమానంగా జీవించే హక్కును రాజ్యాంగం ద్వారా కల్పించారని తెలియచేశారు. ప్రతి 17 మందిలో ఒకరు ఈ రోజుకు కూడా సంపూర్ణంగా తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలి. సీఎం వైఎస్ జగన్ పరిపాలన పగ్గాలు చేపట్టిన రోజు నుంచి సమానత్వం ఏ విధంగా తీసుకుని రావాలి అనే దిశగా ఆలోచన చేస్తూ పరిపాలన చేస్తున్నారు. పేదలకు అవసరమైన ఉపాధి, చదువు, ఆరోగ్యం సమకూర్చాలనే దిశగా పరిపాలన సాగిస్తున్నారు. ఎవరు ఎవరికి బానిసలు కాదు, అందరూ సమానులే. పేదరికానికి స్వస్తి చెప్పాలని అనేక సంక్షేమ పథకాలను జగన్ తీసుకువచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలు ఇప్పటికే అమలు చేయడంతో పాటు, మేనిఫెస్టోలో లేకపోయినా, ఓబీసీలు కూడా నష్టపోతున్నారనే ఉద్దేశంతో వారి కోసం ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేశారు. ప్రపంచదేశాలలో చూస్తే అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అత్యంత ఉన్నతమైనది, శక్తివంతమైనది. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని అమలు చేసుకుని ఉంటే భారత దేశంలో పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉండి ఉండేవి అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే కిలారి రోశయ్య, విజయవాడ సిటి అధ్యక్షులు బొప్పన భవకుమార్, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌‌ అమ్మాజి, కనకారావు మాదిగ, నవరత్నాల అమలు ప్రోగ్రామ్‌ వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరి రావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed