రూ.2వేల కోట్ల ఇసుకను జగన్ మేసేశారు : దగ్గుబాటి పురంధేశ్వరి

by Seetharam |   ( Updated:2023-10-31 09:41:32.0  )
రూ.2వేల కోట్ల ఇసుకను జగన్ మేసేశారు : దగ్గుబాటి పురంధేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇసుక అక్రమ రవాణాలో తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.2వేల కోట్లు అందిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటిపురంధేశ్వరి అన్నారు. ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న అంశంపై విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాకు వివరించారు. వైసీపీ పాలనలో ఇసుకను వ్యాపారంగా మార్చిందని పురంధేశ్వరి ఆరోపించారు. ఈ సందర్భంగా ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు పాతర వేసిన విషయాన్ని ఫొటోలు ద్వారా మీడియాకు ఆధారాలు చూపిస్తు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు పలికేది అందులో ఎక్కువ భాగం ట్రాక్టర్ ఎగుమతి, దిగుమతి ఛార్జీలు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక అయిదు నుండి ఆరువేల రూపాయలు ధర పలుకుతోంది అని ఆరోపించారు. ఇసుక ధరతో భవన నిర్మాణ వ్యయం గోరంత ఉండాల్సింది కొండంతగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా బడుగులు , మధ్యతరగతి వారు నిర్మాణాలను గత్యంతర లేక నిలిపి వేశారన్నారు. ఈ కారణంగా 35 నుండి 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డున పడ్డాయి అని ఆరోపించారు. దీనికి 2021 మే3వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ ని తీసుకుని వచ్చింది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించారు. ఈ మూడు జోన్లలో లభ్యమయ్యే ఇసుక తవ్వకాలను ఢిల్లీకి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్ అనే గుత్తేదారునికి హక్కులు కల్పించారని పురంధేశ్వరి ఆరోపించారు . ఈవిషయంలో ఎవ్వరినీ ఇందులో పోటీ దారు లేకుండా చేసి కేవలం సంవత్సరానికి రూ.760 కోట్లు చెల్లించే షరతు పై ఒప్పందం ప్రభుత్వం చేసుకుందని వివరించారు. ఈ ఒప్పందంలో గుత్తేదారుడు ఎవ్వరికీ సబ్ లీజ్‌కు ఇవ్వకూడదు అనే నిబంధన ఉందని అయితే దాన్ని ఉల్లంఘించి విజయవాడ కు చెందిన టర్న్ కీ ఎంటర్ ప్రైజస్‌కు సబ్ లీజ్‌ ఇచ్చారని బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.

రూ.120 కోట్లు ఏమైనట్లు

ప్రతీ ఏడాది ఇసుకపై రూ.188 కోట్లు ఆదాయం వస్తుండగా ప్రభుత్వానికి కేవలం రూ.63 కోట్లు మాత్రమే చేరుతుందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. మిగిలిన రూ.120కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కి జమఅవుతోంది. అంటే 16నెలల్లో రూ. 2000 కోట్లు ఇసుకను మేసేశారు అని పురంధేశ్వరి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని జూబ్లీహిల్స్ నివాసి సుధాకర్ రెడ్డి నడిపించారని ఆరోపించారు. ఈ వ్యక్తికి ఒక ఐఏఎస్ అధికారి సహకరించినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇసుక తవ్వకానికి సంబంధించి ఆయా జిల్లాల్లోని కలెక్టర్, మైనింగ్ ఏడీల సంయుక్త ఆధ్వర్యంలో అనుమతులుతో జరగాలి కానీ ఇసుక గుత్తేదారుడుకు చెందిన గుమస్తా ఈ విషయంలో కీలక పాత్రవహిస్తున్నాడు అని ఆరోపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం భారీ యంత్రాలతో తవ్వకాలు చేయకూడదు..నదీ గర్భంలో డ్రెడ్జింగ్ నిర్వహించ కూడదు, వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలి ఈ విధంగా ఉన్న అనేక నిబంధనలకు పాతరేసి యధేచ్చగా ఇసుక తవ్వకాలు నిర్వహించారు అని బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.

Advertisement

Next Story