మెడికోల దాడులు చూసాక భయమేస్తోంది.. ప్రజలే అరికట్టాలి: నారా లోకేశ్

by Seetharam |
మెడికోల దాడులు చూసాక భయమేస్తోంది.. ప్రజలే అరికట్టాలి: నారా లోకేశ్
X

దిశ , డైనమిక్ బ్యూరో : మెడికల్ కళాశాలల్లో గంజాయి వంటి మాదక ద్రవ్యాలు లభించడం కలకలం రేపుతోంది. ఏకంగా గంజాయికి అలవాటు పడిన మెడికోలు క్లాస్ రూమ్‌లోనే రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాటకు దిగారు. క్లాస్ రూమ్ దగ్గర నుంచి ఏకంగా రోడ్డుపైకి వచ్చి నెత్తురోడేలా కొట్టుకున్నారు. ఈ ఘటన ఒంగోలులోని రిమ్స్ మెడికల్ కాలేజీలో వెలుగులోకి వచ్చింది. రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న విద్యార్థుల మధ్య ఏడాది కాలంగా గంజాయి విషయంలో వార్ నడుస్తోంది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను మరికొందరు విద్యార్థులు హెచ్చరించడంతో ఈ కొట్లాట జరిగింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

బావి డాక్టర్లు గంజాయికి బానిసలవ్వడం బాధాకరం

ప్రజల ఆరోగ్యాలు కాపాడే బావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆస్పత్రిలో పేషెంట్లు అవ్వడం చాలా బాధాకరమని అన్నారు. మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారడం దురదృష్టకరమని నారా లోకేశ్ ఆరోపించారు. గంజాయి మత్తుకు బానిసైన కొంతమంది మెడికోల హింసాప్రవర్తన చూసిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో అద్ధం పడుతుందని అన్నారు. పాఠశాలల్లో సైతం విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారుతున్నారని ఈ విషయాన్ని తాను యువగళం పాదయాత్రలో గమనించినట్లు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో యువత భవిత నాశనం అవుతుందనే ఆందోళనతో ఏపీలో డ్రగ్స్ దందాలను కట్టడి చేయాలని గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు నారా లోకేశ్ గుర్తు చేశారు. ప్రధానికి లేఖ రాసినప్పటికీ ఇప్పటికీ ఏపీలో గంజాయి తీవ్రత తగ్గలేదని అందుకు ఉదాహరణే ఒంగోలు రిమ్స్‌లో మెడికోల కొట్లాట అని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ వద్దని చెప్పాల్సిన కొంతమంది వైద్య విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసలయ్యారంటే ఇది చాలా ఘోరమైన పరిస్థితి అని నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలకులు యువత భవిష్యత్‌పై దృష్టి సారించదని.. ఇలాంటి ఘోరాలను ఆపడంలో శ్రద్ధ చూపించదని అన్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలే నేరుగా రంగంలోకి దిగి యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ‌పిల్లలు మత్తుకి బానిసలు కాకుండా కాపాడుకుందామని.. ఈ పోరాటంలో టీడీపీ భాగస్వామిగా ఉంటుందని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది

ఒంగోలులోని రిమ్స్ మెడికల్‌ విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. గంజాయి మత్తులో నడిరోడ్డుపై రౌడీషీటర్ల కంటే ఘోరంగా ప్రవర్తించారు. గంజాయి సేవించిన మెడికోలు ఇష్టం వచ్చినట్లు తరగతి గదిలో ప్రవర్తిస్తుండటంతో మిగిలిన విద్యార్థులు మందలించే ప్రయత్నం చేయగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాలేజీ యాజమాన్యం విచారణ చేయించగా తొమ్మిది మంది గంజాయి తాగుతున్నారని రుజువైంది. దీంతో వారిని హాస్టల్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కాలేజీలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య డ్రగ్ వార్ నడుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మరోసారి తరగతి గదిలో మాటామాటా పెరిగడంతో ఫిర్యాదు చేసిన విద్యార్థులపై వారు దాడికి దిగారు. ఈ ఘటనలో విద్యార్థులపై కేసులు నమోదు అయ్యాయి. మెడికల్‌ కాలేజీ విద్యార్థులు గొడవలు పడడం తన దృష్టికి వచ్చిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ. ఏడుకొండలరావు వెల్లడించారు. కొందరు విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారని గతంలో నిర్ధారణ అయినట్టు తెలిసిందన్నారు. ఇదిలా ఉంటే కర్నూలు మెడికల్‌ కళాశాల మెన్స్‌ హాస్టల్‌లో గంజాయి పట్టుబడటం ఈనెల 21న కలకలం రేపింది.మెడికోలు ఇటీవల మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ నెల 17, 18వ తేదీల్లో హాస్టల్‌ డిప్యూటీ వార్డెన్‌, అసిస్టెంట్‌ వార్డెన్‌లు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టగా... ఓ గదిలో నలుగురు వైద్య విద్యార్థులు మద్యం సేవిస్తూ గంజాయి తాగుతూ కనిపించారు. మెడికల్‌ కాలేజీ చరిత్రలో మొదటిసారిగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed