కూతురు v/s తండ్రి.. ఉదయగిరిపై వైసీపీ వ్యూహం అదేనా?

by samatah |
కూతురు v/s తండ్రి.. ఉదయగిరిపై వైసీపీ వ్యూహం అదేనా?
X

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజవకర్గంలో వైసీపీ ఇన్‌చార్జి నియామకంపై ఉత్కంఠ ఇంకా వీడలేదు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే కారణంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఇటీవల పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దాంతో ఆ పార్టీ ఇన్‌చార్జి పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవిని దక్కించుకునేందుకు వైసీపీలో కొందరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మొదటి భార్య కూతరు రచన రెడ్డి పేరును పెదనాన్న రాజమోహన్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు.

దిశ, నెల్లూరు : ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్‌చార్జి నియామక బాధ్యతలను అధిష్టానం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామక‌‌ృష్ణ రెడ్డికి అప్పగించింది. దాంతో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తెగ ఆరాటపడుతున్నారు. సజ్జలతో వరుస భేటీలు జరుపుతున్నారు. సజ్జల కూడా ఏదో ఓక హామీ ఇచ్చి తిరిగి పంపుతున్నారని సమాచారం. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అందులో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. కొద్దిరోజుల్లోనే రెండు నియోజకవర్గాలకు మాత్రమే ఇంచార్జులను ప్రకటించి ఉదయగిరికి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మేకపాటిని పార్టీ నుండి సస్పెండ్ చేసి నెలలు గడుస్తున్నా నేటికీ ఆ స్థానాన్ని ఎవరికీ కట్టబెట్టలేదు.

ఆచితూచి అడుగులు

ఉదయగిరి బాధ్యతలను అప్పగించే విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. నియోజవర్గంలో వైసీపీ పరిస్థితి బలహీనంగా ఉంది. ఆర్థిక బలం, పలుకుబడి ఉన్న నేతలకు బాధ్యతలను అప్పగించాలని వైసీపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉదయగిరి విషయంలో వైసీపీ ఎంటువంటి ప్రకటన చేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ధనుంజయ రెడ్డి. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిలతో ఒక స్థానిక నేత కూడా ఇన్‌చార్జ్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. తెర వెనుక కూడా మరికొందరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా నేతలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఒకరు వాల్ పోస్టర్లతో ఆదరకొడుతుంటే, మరొకరు రెబల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై వ్యతిరేకంగా తొడలు చరుస్తు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

రచనరెడ్డి ఎవరంటే..

కాగా, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్న రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఉదయగిరి నుంచి చంద్రశేఖరరెడ్డి కుమార్తె రచనా రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జగన్ అడిగితే చెబుతానని వెల్లడించారు. చంద్రశేఖర్ రెడ్డి మొదటి భార్య కూతురు రచన రెడ్డి. ఆయన రెండో పెళ్లి చేసుకున్న తరువాత కుటుంబ కలహాల నేపథ్యంలో మొదటి భార్య కుటుంబంతో దూరంగా ఉంటున్నారు. అయితే రాజమెహన్ రెడ్డి కుటుంబానికి తమ్ముడి కూతురు రచనరెడ్డి కుటుంబానికి సంబంధాలు బాగానే ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా మేకపాటి కుటుంబమే పోటీ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో దానిని కొనసాగించేందుకు రచనరెడ్డి పేరును మేకపాటి రాజమోహన్ రెడ్డి తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద వైసీపీ తరుపున ఆయన కూతురినే పోటీకి నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిద్వారా మేకపాటి కుటుంబ ఓటు బ్యాంకు కూడా లాస్ కాకుండా ఆయనకు గుణపాఠం చెప్పడమే పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే రచనరెడ్డి పేరును కొదరు నేతలు ఇష్టపడడంలేదని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed