Aadabidda Nidhi Scheme: ఆడబిడ్డ నిధికి పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలా?

by Rani Yarlagadda |
Aadabidda Nidhi Scheme: ఆడబిడ్డ నిధికి పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. వీటిలో ఒక పథకమైన ఆడబిడ్డ నిధి (Aadabidda Nidhi Scheme) పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అయితే మహిళలందరికీ ఒకటే టెన్షన్. తమకు పోస్టాఫీస్ లో అకౌంట్ లేకపోతే ఖాతాల్లో నగదు పడదా ? అని. అందుకు కారణం సోషల్ మీడియా.

సోషల్ మీడియాలో.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళలకు కచ్చితంగా పోస్టాఫీసులో అకౌంట్ ఉండాలని, ఆధార్ తో అకౌంట్ ను లింక్ చేసి, థంబ్ వేయాలని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో మహిళలతో పాటు.. వారింట్లో మగవాళ్లు కూడా ఉన్న పనులన్నింటినీ మానుకుని మరీ పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు పొందాలంటే.. పోస్టాఫీసుల్లో అకౌంట్లు ఉండాల్సిందేనని వదంతులు వ్యాపించడంతో మహిళలు పోస్టాఫీసులకు పరిగెడుతున్నారు. నిజానికి ఇది అవాస్తవం.

సేవింగ్స్ అకౌంట్ లేనివారు అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసేటపుడే ఆధార్ తో లింక్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ (State Bank), గోదావరి బ్యాంకుల్లో (Godavari Bank Account) అకౌంట్లు ఉన్నవారు తమ ఆధార్ ను లింక్ చేయించుకుని NPCI (National Payments Corporation of India) చేయించుకుంటే చాలు. డీబీటీ (Direct Benefit Transfer) పద్ధతిలో రూ.1500 అర్హులైన వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అకౌంట్లు లేనివారు సచివాలయ సిబ్బందిని అడిగి.. ఎక్కడ, ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో తెలుసుకుని వెళ్లండి. పోస్టాఫీసు (Post Office Savings Account)కు వెళ్లి అకౌంట్ కావాలని అడిగితే.. ఉన్నవారి నుంచి, లేనివారి నుంచీ కూడా రూ.200 తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జనసేన సోషల్ మీడియా వాట్సప్ ఛానల్ లో ఇందుకు సంబంధించిన సమాచారం పెట్టారు. " ఆడబిడ్డ నిధికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు. కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేసే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల ఇచ్చే 1500 రూపాయలకి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఆడబిడ్డ నిధికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు" అని అందులో పేర్కొన్నారు.




Advertisement

Next Story

Most Viewed