రసవత్తరంగా అన్నమయ్య జిల్లా పొలిటికల్ వార్

by Mahesh |   ( Updated:2024-03-21 03:51:17.0  )
రసవత్తరంగా అన్నమయ్య జిల్లా పొలిటికల్ వార్
X

దిశ, రాయచోటి: ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమవ్వడంతో అన్నమయ్య జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది. వైసీపీ తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి యుద్ధానికి సిద్ధమైంది. టీడీపీ కూటమి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందే ప్రకటించేశారు. కడప ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా, మదనపల్లికి నిస్సార్ అహ్మద్ ను ప్రకటించగా, మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఖరారు చేశారు. రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పీలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సమరానికి లాంఛనంగా ప్రకటించారు.

జగన్ దూకుడు..

రెండు సంవత్సరాలకు పైగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిరంతరంగా నియోజకవర్గాల్లో పర్యటించేలా చేయడంలో సఫలమయ్యారు. కానీ ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రగతి నివేదికలో వెనుకబడటంతో అప్పుడే అధిష్టానం ఆ ఎమ్మెల్యేలకు సీరియస్ గా హెచ్చరించినట్లు తెలిసింది. అందులో భాగంగానే రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషాలను 2024 ఎన్నికల బరి నుంచి తప్పించి ఆ స్థానంలో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించి ప్రచారం ముమ్మరం చేయాలని సీఎం జగన్ అభ్యర్థులను ఆదేశించారు. ఇదే క్రమంలో సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని తిరిగి 2024 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో దింపుతున్నట్టు ఆయన పేరును ఖరారు చేశారు.

ఆచితూచి టీడీపీ కూటమి అడుగులు..

ఇప్పటికే జిల్లాలో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయగా, టీడీపీ కూటమి 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు చేసి రెండు నియోజకవర్గాలు మాత్రం అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. 2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని తిరిగి పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. రాయచోటి నియోజకవర్గం నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , మదనపల్లికు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడు మాజీ ఎమ్మెల్యే నిస్సార్ అహ్మద్ ను, తంబళ్లపల్లి కు కొత్త ముఖాన్ని తెరపైకి చేస్తూ జయచంద్రారెడ్డిని బరిలో దింపారు.

రైల్వే కోడూరు జనసేనకు?

రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో టీడీపీ కూటమి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాజంపేట టీడీపీకి రైల్వే కోడూరు జనసేనకి కేటాయించాలని అధిష్టానం నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థికా, బీజేపీకా అని అధిష్టానం కు తలనొప్పిగా మారింది. పొత్తుల్లో భాగంగా బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్లు వినిపిస్తున్నాయి.

Read More..

విశాఖ ఉక్కుకు కరెంట్ షాక్

Advertisement

Next Story

Most Viewed