- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News: సమాచార శాఖ కమిషనర్‌పై విచారణ..
దిశ ప్రతినిధి, అమరావతి: అహంకారం అనే పదానికి అర్థం ఇలా వుంటుందని తన వైఖరి ద్వారా, వ్యవహారశైలి ద్వారా, నిబంధనల ఉల్లంఘన ద్వారా నిరూపించి మీడియాను ప్రభుత్వానికి పూర్తిగా దూరం చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి వైసీపీ మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య భారతి మద్దతుతో ఐదేళ్ల పూర్తి కాలం పనిచేసిన ఆయనపై ఆరోపణలకు అంతేలేదు.
సమాచార శాఖతో పాటు, సాంస్క్కతిక శాఖ బాధ్యతలు కూడా చూసిన విజయకుమార్ రెడ్డిపై వచ్చిన ఆరోపణల వివరాలను సేకరిస్తున్నారు. కొన్ని మీడియా హౌస్‌లకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు ఇవ్వడం, మరికొన్నింటికి బిల్లులు ఆపేయడం వంటివెన్నో జరిగాయి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వుండాల్సిన సమాచార శాఖను నియంతల పాలనలోకి తీసుకువెళ్లి పత్రికల పొట్టగొట్టిన ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకొనేందుకు నారా చంద్రబాబ నాయుడు నేతృత్వంలోని నూతన ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ కారణంగానే ఆయనను రిలీవ్ చేయకుండా కొనసాగింపజేస్తున్నారని తెలిసింది.
అక్రెడిటేషన్ల తగ్గింపుతో పాత్రికేయులకు దూరం..
కమిషనర్‌గా వచ్చి రాగానే పాత్రికేయులకు సేవలందించాల్సిన ఆయన అధికార పార్టీ మీడియా భజనలో మునిగితేలుతూ పాత్రికేయుల పొట్టగొట్టారు. అవసరం లేని నిబంధనలు తెచ్చిపెట్టి గత తెలుగుదేశం ప్రభుత్వంలో వున్న 22 వేల విలేకరుల అక్రెడిటేషన్ కార్డులు (గుర్తింపు కార్డులు)లను ఆరు వేలకు కుదించివేశారు. అక్రెడిటేషన్ కమిటీల్లో నుంచి గుర్తింపు పొందిన పాత్రికేయ
సంఘాలను తొలగించి వైసీపీ మీడియాకు, వారు చెప్పిన వారికి మాత్రమే అవకాశం కల్పించారు. పాత్రికేయులకు గుర్తింపు కార్డులు కోత పెట్టడం వల్ల కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కరోనా సాయంలోనూ ద్రోహమే..
విజయకుమార్‌రెడ్డి కరోనాతో మృతి చెందిన గుర్తింపు పొందిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించి సమాచార శాఖ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వందకుపైగా దరఖాస్తులు రాగా అందులో 84 దరఖాస్తులకు పరిహారానికి అర్హత వున్నదని అధికారులే తేల్చారు. అయితే, పాత్రికేయులకు పరిహారం ఇస్తే మిగిలిన వర్గాలకు ఇవ్వాల్సివస్తుందన్న సాకుతో విజయకుమార్ రెడ్డి ఇవ్వకుండా అడ్డుకొన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జీవీడీ కృష్ణమోహన్ వంటి పాత్రికేయ ప్రముఖులు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో వున్నప్పటికీ వారిని లెక్క చేయకుండా విజయకుమార్ రెడ్డి వ్యవహారాలు సాగించారనే ఆరోపణలున్నాయి.
జీవో 142 తో చిన్న పత్రికలకు అన్యాయం..
ఎక్కడా లేని విధంగా పత్రికలను జీఎస్టీతో ముడిపెడుతూ జీవో నెంబర్ 142ను తీసుకొచ్చి చిన్న, మధ్య తరగతి పత్రికలకు ప్రభుత్వం నుంచి ప్రకటనల రూపంలో అందే సాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చిన్న పత్రికలు ఒక వెలుగు వెలగ్గా, తనయుడు వైఎస్ జగన్ హయాంలో విజయకుమార్ రెడ్డి వంటి అధికారుల కారణంగా తీవ్రంగా దెబ్బతినడమే గాక వాటిని నడిపే పాత్రికేయులు రోడ్డున పడ్డారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ప్రకటనల బిల్లులను ఇవ్వకుండా తొక్కిపెట్టి కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మరీ ఇవ్వాల్సివస్తే కమీషన్లు గుంజి పత్రికా యజమానులకు నరకం చూపారు. విజయకుమార్ రెడ్డి అండదండలతో సమాచార శాఖలో ఎంఆర్ సెక్షన్ బాధ్యతలను నిర్వర్తించిన జాయింట్ డైరెక్టర్ కస్తూరి వైఖరి కారణంగా ఆ శాఖకు పలువురు పాత్రికేయులు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు గట్టిగా ఇదేమని ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడతామనే బెదిరింపులు కూడా రావడం గమనర్హం.
పాత్రికేయుల ఇంటి స్థలం హామీ నెరవేరలేదు..
వైసీపీ ఎన్నికల ముందు విడుదల చేసిన నవరత్నాల ఎన్నికల మేనిఫెస్టోలో పాత్రికేయులకు ఇళ్ల స్థలం హామీ కూడా వుంది. అయితే సంబంధిత కమిషనర్ విజయకుమార్‌రెడ్డి అహంకార పూరిత వైఖరి కారణంగా 2024 జనవరి వరకూ దీనిపై ప్రభుత్వం ఆలోచనే చేయలేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేముందు హడావుడి చేసినా ఒక్క జిల్లాలో కూడా కసరత్తు పూర్తి అయినా స్థలాలు పాత్రికేయులకు అందలేదు.
సీఎం క్యాంప్ ఆఫీసులో రూ.70 లక్షలు వదిలేసినట్టేనా?
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వుండగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి సమాచార శాఖ నుంచి రూ.70 లక్షలతో వస్తువులు కొనుగోలు చేశారు. లేపాక్షి నుంచి వీటిని కొనుగోలు చేసి క్యాంప్ ఆఫీసు అవసరాల కోసం వుంచారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ క్యాంప్ కార్యాలయం కాస్తా వైసీపీ పార్టీ కార్యాలయంగా మారిపోయింది. అయితే, స్వామి భక్తితో ఆ రూ.70 లక్షలతో కొనగోలు చేసిన వస్తువులను మాత్రం విజయకుమార్ రెడ్డి వెనక్కితీసుకురాకుండా ఉద్దేశపూర్వకంగా మౌనం నటిస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. పాత్రికేయులకు విలువనిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం భ్రష్టు పట్టిన సమాచార శాఖను సంస్కరించడంతో పాటు ఇందుకు బాధ్యులైన అధికారులను శిక్షించే పనిని కూడా ప్రారంభించింది.