సీఎంల నుంచి మంత్రుల వరకు... స్వామీజీకి ఎందుకింత డిమాండ్!

by Sathputhe Rajesh |
సీఎంల నుంచి మంత్రుల వరకు... స్వామీజీకి ఎందుకింత డిమాండ్!
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలనుకున్న సీఎం జగన్ ఆశయం మరోలా సిద్ధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ ఎగ్జిక్యూషన్ అంతా విశాఖలోని శారదా పీఠం నుంచే నడుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా అయినా.. కొత్త మంత్రి విడదల రజని అయినా.. పదవీ బాధ్యతలు స్వీకరించారో లేదో స్వామీజీ పాదాల చెంతకు చేరుకున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే అంతకంటే ముందే తన హాజరు శారదాపీఠంలో వేయించుకున్నారు. సీఎం జగన్ అమితంగా విలువ ఇస్తున్న నేపథ్యంలో విశాఖ శారదా పీఠానికి ఇటీవల ప్రాముఖ్యత పెరిగింది. సాధారణంగా మంత్రులకే సీఎం వద్ద అపాయింట్ మెంట్ దొరకడం అంత సులభం కాదనే పేరుంది. దీంతో తమ కష్టాలూ విజ్ఞప్తులూ విశాఖకు వచ్చి స్వామీజీకి చెప్పుకుంటే ఆయనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతారని వైసీపీలో ఒక నమ్మకం బయలుదేరింది. సిఫార్సులు కావొచ్చు ..మరే పనైనా కావొచ్చు.. ఒక్కసారి శారదా పీఠానికి వస్తే చాలు పనైపోతుందనే నమ్మకం కలగడంతో అధికారులు, మంత్రులు, ఇతర నేతలు చలో శారదా పీఠం అంటున్నారు.

స్వామి పాదాల చెంతకు వరుస కట్టిన మంత్రులు

కొత్త మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మత్స్యకార మంత్రి సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి రోజా, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ఇప్పటివరకు స్వామి కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి రోజా అయితే విశాఖలోనే అతిగొప్ప పర్యాటక ప్రాంతంగా శారదా పీఠాన్ని తీర్చిదిద్దుతానని స్వామీజీ పాదాలకు మొక్కిన అనంతరం మీడియాకు తెలిపారు.

ఇతర రాష్ట్రాల సీఎంలు, అధికారులు సైతం శారదా పీఠానికి క్యూ..

కేవలం రాష్ట్ర మంత్రులే కాదు.. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం స్వామీ స్వరూపానంద సరస్వతిని దర్శించుకుంటున్నారు. ఆరోగ్య చికిత్స కోసం వైజాగ్ వచ్చిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇటీవల స్వామీజీని కలిశారు. ఒడిశా, తెలంగాణ నుంచి మంత్రులు రావడం కూడా ఇప్పుడు సాధారణమైంది. మన రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో కొందరు కూడా స్వామి అనుగ్రహం కోసం శారదా పీఠానికి వస్తున్నారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి శారదా పీఠం వైపే కేంద్రీకృతమైంది.

ఇదంతా ఎలా మొదలైంది?

ఒక పదేళ్ల క్రితం వరకూ విశాఖ శారదా పీఠం అంటే ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు. ఉత్తరాది హిమాలయాల్లోనూ.. వారణాసిలోనూ పర్యటించిన స్వామి స్వరూపానంద వద్ద రాజశ్యామల అమ్మవారిని ఆవాహన చేసుకునే మంత్రాలపై స్వామీజీ పట్టు సాధించారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తుపుర్వం రాజులు యుద్ధానికి వెళ్లేటప్పుడు రాజశ్యామల యాగం చేసేవారని, అలా చేసిన వారు ఖచ్చితంగా యుద్ధంలో విజయం సాధించే వారని ఆశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోనే మొదటిసారిగా ఈ రాజశ్యామల అమ్మవారిగా చెప్పుకునే దేవత గుడి శారదా పీఠంలోనే కట్టారని, అందుకే ఇక్కడకు మంత్రులు క్యూ కడుతున్నారని శారదా పీఠం వర్గాలు చెబుతున్నాయి.

ముందుగా వచ్చింది సీఎం కేసీఆరే

తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో స్వరూపానంద స్వామిజీని కలిసిన వారిలో ముఖ్యులు. రాజశ్యామల యాగం జరిపించిన ఆయన ఈ స్వామిజీకి పెద్ద ఎత్తున ప్రాచుర్యం కలిగించారు. అనంతరం వైసీపీ అధినేత జగన్ శారద పీఠం బాట పట్టారు. విపక్షంలో ఉండగా 4 సార్లు, అధికారంలోకి వచ్చాక 4 సార్లు శారద పీఠం దర్శనం చేసుకున్నారు. ఇవికాక ఉత్తరాదిన స్వామీజీ ఉండగా అక్కడకు వెళ్లి మరీ గంగలో మునిగారు జగన్. ఆ ఫొటోలు పెద్దఎత్తున వైరల్ కూడా అయ్యాయి. ఇక అనుకున్నట్టుగానే సీఎం జగన్ అధికారంలోకి రావడంతో స్వరూపానంద పేరు మార్మోగింది. సాక్షాత్తూ సీఎం స్వామీజీ వద్దకు వస్తుండడంతో మంత్రులకు సీఎం వద్దకు తమ విన్నపాలు ఎలా చేరవేయాలో అర్థమైంది. దీంతో చలో శారద పీఠం అని విశాఖకు పరిగెత్తుకు వస్తున్నారు సదరు మంత్రులు. ఇది మెదటి విడత కేబినెట్ మంత్రులకంటే ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఎక్కువగా కనబడుతున్నది.

మిగతా స్వామీజీల కంటే డిఫరెంట్ స్వరూపానంద

స్వరూపానంద స్వామీజీ చాలా భిన్నమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా స్వాములు కొంతకాలం వైభవంతో వెలిగినా రాజకీయాల్లో తమ ముద్ర వేయాలని ప్రయత్నించి అభాసు పాలవ్వడమే కాకుండా తమ అభిమాన ముఖ్యమంత్రులకూ దూరం అయ్యారు. స్వరూపానంద మాత్రం తాను స్వయంగా రాజకీయాలపరంగా లబ్ధి పొందాలని చూడకపోవడం విశేషం . కేవలం ముఖ్యమంత్రికి, మంత్రులకూ మధ్య ఒక వారధిలా పనిచేయడానికి మాత్రమే పరిమితం కావడంతో రాష్ట్రంలోని మంత్రులకు ఆయనపై గురి కుదిరింది. ఒడిశా మంత్రి ఏకంగా స్వామిజీ సూచన మేరకు తన రాష్ట్రంలో ఏకంగా రాజశ్యామల అమ్మవారికి గుడి కూడా కట్టేస్తున్నారు. ఇక స్వరూపానంద చెప్పిన పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిపోతున్నాయని వినికిడి. దేవాదాయ శాఖలో స్వామీజీ మాటే వేదం. సింహాచలం కావొచ్చు.. రుషికొండ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయం కావొచ్చు.. స్వామీజీకి చెప్పాకే ఏ కార్యక్రమమైనా అన్నట్టు పరిస్థితి ఉందని విశాఖవాసులు అనుకుంటున్నారు. ఇక స్వామీజీ అభిమతం మేరకు ఈ మధ్యే భీమిలిలో ప్రశాంత వాతావరణం మధ్య భూమిని కేటాయించింది ప్రభుత్వం. మొత్తంగా ఏపీలో శారద పీఠం ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతున్నది.

Advertisement

Next Story