కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. పరిశీలనలో ఆ ముగ్గురు ఎంపీల పేర్లు?

by Nagaya |
కేంద్ర కేబినెట్‌లోకి వైసీపీ.. పరిశీలనలో ఆ ముగ్గురు ఎంపీల పేర్లు?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌పై పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తోందా..? ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏర్పడబోయేది బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమేనని బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా బీజేపీ వ్యూహరచన చేస్తుందా? ఏపీ బీజేపీలో సంస్థాగతంగా మార్పులు వెనుక మతలబు అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏపీలో బలపడాలనే యోచనలో బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా రాజకీయం నడిచింది. గత ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించింది. మీకు మేము మాకు మీరు అన్నట్లుగా ఇరు పార్టీలు వ్యవహరిస్తూ రాజకీయం చేశాయి. ఒకానొక దశలో కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరబోతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. అయితే ఏపీలో బీజేపీ బలపడాలనే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో వైసీపీని కేబినెట్‌లోకి ఆహ్వానిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ నాయకత్వం అనేక మార్పులు చేర్పులు చేసింది. అంతేకాదు కేంద్రకేబినెట్ విస్తరణ సైతం జరగనుంది. ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్‌లో ఏపీ భాగస్వామ్యం లేదు.

అయితే తాజాగా వైసీపీని బీజేపీ కేంద్ర కేబినెట్‌లో భాగస్వామ్యం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కేంద్ర కేబినెట్‌లో చేరే అంశంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర కేబినెట్‌లో ఏపీ భాగస్వామ్యం ఉంటుందని అయితే అది బీజేపీకి చెందిన వారికే పదవులు కట్టబెడతారనే మరో ప్రచారం కూడా జరుగుతుంది.

వైసీపీకి బీజేపీ బంపరాఫర్

ఆంధ్రప్రదేశ్‌లో పట్టు సాధించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో అధికారం చేజిక్కించుకోవాలని లేదా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలదళం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని ప్రాంతీయ పార్టీలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. జనసేన పార్టీతో ప్రస్తుతానికి పొత్తులో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎలా వెళ్లాలో అనేదానిపై క్లారిటీ లేదు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వారాహి విజయయాత్ర చేస్తున్నప్పటికీ బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ పైనే ఆధారపడ్డారు. మరోవైపు వారాహి విజయయాత్ర విజయవంతం అవుతున్నప్పటికీ జనసేన పార్టీ మేనిఫెస్టో కానీ విధి విధానాలపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో ఆ పార్టీతో ఎన్నికలకు వెళ్లే అంశంపై కమలదళంలో కలవరం పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారం చెలాయించాలంటే అది జనసేనతో కాదని బీజేపీ అగ్రనాయకత్వం భావించిందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వైసీపీకి తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని అధికార వైసీపీని కూడా బుట్టలో వేసుకుందామని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా వైసీపీకి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పిస్తామని బంపరాఫర్‌ సైతం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కర్ణాటక ఫలితాలతో అలర్ట్

కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవల గత కొంతకాలంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. దీంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. మరోసారి బలమైన శక్తిగా అవతరించాలనే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. అప్పటి వరకు తామే హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల ఫలితాలు బొక్కబోర్లాపడేలా చేశాయి. ఇదే పరిస్థితి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జరిగితే బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలకు తాయిలాలు ఇచ్చే పనిలో పడింది. ఇలా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎరవేసి బీజేపీ అధికార పీఠమెక్కిన సంగతి తెలిసిందే. అందుకు మహారాష్ట్ర ఒక ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఏపీలోని వైసీపీ, టీడీపీ,జనసేన పార్టీలు బీజేపీ భజన చేస్తున్నాయి. అన్ని పార్టీలు బీజేపీ కనుసన్నుల్లోనే మెలుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో వైసీపీకి మంచి పట్టుంది. అన్ని సర్వేలలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీని కేంద్ర కేబినెట్‌లో భాగస్వామ్యంగా చేర్చుకుంటే తమకు కలిసి వస్తుందనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వైసీపీతో పొత్తు లేకపోయినప్పటికీ బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతీబిల్లుకు వైసీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే ఇరు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రకేబినెట్‌లోకి వైసీపీని ఆహ్వానిస్తే తాము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కేబినెట్‌లోకి ముగ్గురికి ఛాన్స్

కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు వైసీపీ అంగీకరిస్తే రెండు లేదా మూడు కేంద్రమంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉండటంతోపాటు జాతీయ స్థాయిలో నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో విజయసాయిరెడ్డికే కేంద్రమంత్రిగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు కేంద్రమంత్రి పదవుల్లో ఒకటి బీసీ మరొకటి దళితులకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ పేర్లు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే అత్యధిక అవకాశాలు నందిగం సురేశ్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మోపిదేవి వెంకటరమణ లేదా పిల్లి సుభాష్ చంద్రబోస్‌లలో ఎవరో ఒకరికి కేంద్రమంత్రిగా అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కేంద్రమంత్రివర్గంలో వైసీపీ చోటు కల్పిస్తే ఉభయగోదావరి జిల్లాలో ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడతాయని ఫలితంగా మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా వైసీపీ భావిస్తోంది. అలాగే మోపిదేవి వెంకట రమణకు ఛాన్స్ ఇచ్చినా తీరంలో ఉన్న మత్స్యకారుల ఓట్లు కూడా కలిసి వస్తాయని ఈ నేపథ్యంలో ఇరువురిలో ఎవరో ఒకిరికి చోటు కల్పించే అవకాశం ఉంది.

Advertisement

Next Story