వైసీపీకి నేను మూర్ఖుడిని...లోకేశ్ యువగళం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం

by Seetharam |   ( Updated:2023-11-27 08:04:19.0  )
వైసీపీకి నేను మూర్ఖుడిని...లోకేశ్ యువగళం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మూడు నెలలు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా ప్రతీ ఒక్కరికీ చెల్లిస్తాం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. ఎన్టీఆర్ దేవుడు...చంద్రబాబు నాయుడు రాముడు అయితే వైసీపీ నాయకులకు ఈ లోకేశ్ మూర్ఖుడు అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా తాటిపాక సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్‌ ప్రసంగించారు. అవినీతి అక్రమార్కులు రాజోలులో ఉన్నా.. రష్యాకు పారిపోయినా తీసుకువచ్చి లోపలేసే బాధ్యత తాను తీసుకుంటానని నారా లోకేశ్ తెలిపారు. ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన మలివిడత యువగళం పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. రెట్టింపు ఉత్సాహంతో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభమైంది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇకపోతే తాటిపాక సెంటర్‌లో యువగళం బహిరంగసభకు జనసంద్రం పోటెత్తింది. అటు టీడీపీ ఇటు జనసేన ఇరుపార్టీల కేడర్ నినాదాలతో తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లిపోయాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున సభకు ప్రజలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. యువనేతకు సంఘీభావంగా పాదయాత్రలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీ,ఎస్సీలకు అండగా ఉంటాం

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ.20వేలు ఇచ్చి సాయపడతామన్నారు. మరోవైపు ఎస్సీ,ఎస్టీ,బీసీలకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం బీసీలపట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 26వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టిందని ఆరోపించారు. విధులు, నిధులు లేని కార్పొరేషన్లను బీసీలకు వదిలిపెట్టారని మండిపడ్డారు. ఇదేనా సైకో జగన్ మా బీసీ సోదరులకు ఇచ్చిన భరోసా అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కలిగేలా ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హెచ్చరించారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు దళితులకు చెందాల్సిన 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మెుదటి 100 రోజుల్లో ఆ సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

ఉద్యోగులకు సరైన ఫిట్‌మెంట్ ఇస్తాం

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల భద్రతకు, భవిష్యత్‌కు భరోసా ఇస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఎన్నికలకు ముందు వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారని...తీరా నాలుగు సంవత్సరాల తర్వాత జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. ప్రతీ నెలలో ఒకటో తారీఖున జీతం, ఒకటో తారీఖున రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్, ఉద్యోగస్తులకు సరైన ఫిట్‌మెంట్ ఇస్తాం అని లోకేశ్ హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులను సైతం ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పోలీసులకు రావాల్సిన ఎలవెన్స్ 15 శాతం కట్ చేశాడు అని ఆరోపించారు. ఫలితంగా ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లకు వేలాది వేలు కట్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే జీరో 79ను రద్దు చేస్తాం అని నారా లోకేశ్ పోలీసులకు హామీ ఇచ్చారు.

ఈ జిల్లా వాసుల మమకారం, వెటకారం సూపర్

‘గోదావరి జిల్లా అన్నా...ఈ జిల్లా ప్రజలు అన్నా నాకు ఎంతో ఇష్టం. మరోపక్క భయం కూడా ఉంది. ఏ కార్యక్రమం అయినా ఇక్కడ మెుదలు పెడితే బ్రేక్ రావాల్సిందే. తూర్పుగోదావరిలో వైఎస్ఆర్ పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రకు బ్రేక్ వచ్చింది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు . గోదావరి పరిసర ప్రాంతాలు.. పచ్చదనం చూసిన తర్వాత ఇక్కడే ఉండాలని కోరిక ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ ప్రాంత ప్రజల మమకారం వెటకారం సూపర్ అని కితాబిచ్చారు. తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మనవరాలినే పెళ్లి చేసుకున్నానని లోకేశ్ చెపుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐదుగురు మంత్రులు అయ్యారని వారు అసలు పీకింది పొడిచింది ఏంటి..? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. సఖినేటిపల్లి, నరసాపురం బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చి తిలోదకాలొదిలారని అన్నారు. మేకలపాడులో 150 కుటుంబాలకు పట్టాలిచ్చి ఇళ్లు నిర్మిస్తామని మాటతప్పాడన్నారు. అంతర్వేది రథానికి నిప్పు పెట్టిన నిందితులను ఇప్పటికీ పట్టుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతర్వేది దేవస్థానం అభివృద్ధికి రూ.14 కోట్లు నిధులు విడుదల చేస్తానని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

రాపాక అవినీతి పరుడు

2019లో రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాదరావు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు. తీరా గెలిచిన తర్వాత నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి సైకో జగన్ పార్టీలో చేరారని ఆరోపించారు. వైసీపీలో చేరిన తర్వాత రాజోలును అభివృద్ధి చేస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు రాజోలుని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని మండిపడ్డారు. ప్రస్తుతం రాపాక వరప్రసాదరావు ఐదెకరాలలో ఇళ్లు నిర్మించుకుంటున్నారని.. ఆయన ఇంటికి రోడ్డు నిర్మాణం కోసం ఎంపీ ల్యాండ్స్‌ నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు చింతలమోరిలో పేదలకు చెందిన 15 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఇంకోవైపు ఎమ్మెల్యే తనయుడు వెంకటరావు దిండి ఇసుక రీచ్‌లో ఇసుక దోచేస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు అంగన్ వాడీ,షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు రూ.50వేల నుంచి రూ.5లక్షలకు అమ్మేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిరుపేద మత్స్యాకారుల నుంచి భారీగా భూములు కొట్టేస్తున్నారని విరుచుకుపడ్డారు. బట్టేలంకలో ఎస్సీల సొసైటీ భూములను సైతం వదలకుండా కొట్టేస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లి హౌస్‌లో ఉండే బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతేకాదు సెంటు స్థలం భూ పంపిణీలో భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుని భారీ స్కాంలకు పాల్పడ్డారని లోకేశ్ ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గొల్లపల్లి సూర్యారావు రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశారని ఆరోపించారు. అంతేకాదు రూ.100కోట్లతో మంచి నీటి పథకం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ ఇంటికి నీటికుళాయి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అని నారా లోకేశ్ వెల్లడించారు.

వైసీపీని చిత్తుగా ఓడించాలి

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని.. ఫలితంగా అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి అని నారా లోకేశ్ ఆరోపించారు. త్వరలోనే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం పనైపోతుందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని లోకేశ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. మూడు నెలలు ఓపికపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చేది మన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా ఈ ప్రభుత్వానికి చెల్లిస్తాం అని హెచ్చరించారు. ఎన్టీఆర్ దేవుడు...చంద్రబాబు మరో దేవుడు....వైసీపీ నాయకులకు ఈ లోకేశ్ మూర్కుడు అని చెప్పుకొచ్చారు. వైసీపీ అక్రమార్కులు రాజోలులో ఉన్నా రష్యాకు పారిపోయినా తీసుకువచ్చి లోపలేసే బాధ్యత తీసుకుంటానని నారా లోకేశ్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed