Godavari flood:గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Jakkula Mamatha |   ( Updated:2024-09-05 08:07:40.0  )
Godavari flood:గంటగంటకు పెరుగుతున్న వరద ఉధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ,వెబ్‌డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఏపీలోని విజయవాడను వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 41 అడుగుల నీటిమట్టం నమోదు అయింది. ఇక బుధవారం మధ్యాహ్నం 1.00గంటకు 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి కరకట్ట పైకి యాత్రికుల రాకపోకలకు పోలీసులు నిలిపివేశారు. ఇలాగే వరద ప్రవాహం పెరుగుతుంటే ఈ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మరో పక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగచ్చని అంటున్నారు. ఈ ఏడాది జులై 27న భద్రాచలం వద్ద 53.9 అడుగుల మేర వరద రావడంతో అప్పట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ సమయంలో గోదావరి తీర ప్రాంతం అతలాకుతలం అయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా, మరోసారి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో పరిసర ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద పెరుగుతుంది. ఈ క్రమంలో ధవళేశ్వరం కాటర్ బ్యారేజ్ వద్ద నుంచి 8 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది.

Advertisement

Next Story