Breaking: మాజీ సీఎం జగన్‌ భద్రతపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

by srinivas |
Breaking: మాజీ సీఎం జగన్‌ భద్రతపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ భద్రతపై రాష్ట్రంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. తనకు భద్రత తగ్గించారని, వెంటనే పెంచాలని జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కోర్టులో వాదనలు కొనసాగుతుండగానే వైసీపీ, టీడీపీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. జగన్‌కు భద్రత కుదించలేదని టీడీపీ శ్రేణులు చెబుతుంటే జగన్‌ను ప్రాణహాని కలిగించేందుకు భద్రత తగ్గించారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయం జగన్ భద్రత చుట్టూ తిరుగుతోంది.

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భద్రతపై తాజాగా హోంమంత్రి అనిత సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనల మేరకే ఆయనకు భద్రత ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. జగన్‌కు భద్రత కుదింపు ప్రచారం మాత్రమేనని, అందులో నిజం లేదని అనిత తెలిపారు. ఇప్పటికే జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇచ్చామన్నారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు చుట్టూ ఎక్కువ మంది పోలీసులుండేవారని, ఇప్పుడు కూడా అలా కావాలనడం సరికాదన్నారు. అధికారం కోల్పోయి.. ఎక్కువ మంది సెక్యూరిటీ లేకపోవడంతో జగన్ చాలా ఫీలవుతున్నట్టున్నారని హోంమంత్రి ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుకు సైతం బుల్లెట్ ప్రూఫ్ వాహనమే ఇస్తున్నామన్నారు. జగన్‌కు ఇవ్వాల్సిన భద్రతలో ఎలాంటి మార్పులు లేవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

బాధితుల పరామర్శలకు వెళ్లి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడాన్ని అనిత తప్పుబట్టారు. నంద్యాలలో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని జగన్ పరామర్శించారని, సాయం ప్రకటించకుండా తాను సీఎంగా ఉంటే పథకాలు ఇచ్చేవాడినని జగన్ చెప్పడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయం, సందర్భం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని, అది ఆయన నైజం అని హోంమంత్రి ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed