‘తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు’.. హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula Mamatha |
‘తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు’.. హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి కానీ టీడీపీ ప్రతిష్ఠకు కానీ నష్టం జరుగుతోందని భావిస్తే నా పిల్లలనైనా పక్కన పెడతాను అని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇటీవల హోం మంత్రి అనిత(Home Minister Anitha) పీఏను తొలగించడం పై ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగదీష్ అనే వ్యక్తి నా ప్రైవేటు పీఏ. నా సొంత డబ్బుతో జీతం ఇచ్చా. అతడిపై ఆరోపణలొచ్చాయి. అతన్ని పలుమార్లు హెచ్చరించా. అయినా ఫిర్యాదులు ఆగకపోవడంతో పది రోజుల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించా’’ అని హోంమంత్రి అనిత వెల్లడించారు.

ఈ క్రమంలో విశాఖ కేంద్ర కారాగారం లోని పెన్నా బ్లాక్ సమీపంలో మొబైల్స్(Mobile) దొరకడం, ఖైదీలకు జైలు సిబ్బంది గంజాయి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో నిన్న హోం మంత్రి అనిత ఆకస్మికంగా జైలును పరిశీలించారు. ఈ క్రమంలో ఆమె గత వైసీపీ ప్రభుత్వ పాలన పై విమర్శలు గుప్పించారు. వైసీపీ(YSRCP) హయాంలో జైలులో సెక్యూరిటీ, నిర్వహణ, ఉద్యోగుల బదిలీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని జైళ్లు, పోలీసు స్టేషన్లలో కొందరు అధికారులు, సిబ్బంది ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం(AP Government) వచ్చాక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపడుతోంది. ఇక నుంచి జైలులో ఏం జరిగినా తెలిసేలా అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఐజీని ఆదేశించామని.. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదు అని హోం మంత్రి అనిత హెచ్చరించారు.

Advertisement

Next Story