Amaravati: నారా లోకేశ్ ఓటమే లక్ష్యంగా YCP భారీ స్కెచ్

by srinivas |
Amaravati: నారా లోకేశ్ ఓటమే లక్ష్యంగా YCP భారీ స్కెచ్
X

అమరావతి రాజధానిపై రాజకీయం రసకందాయంగా మారింది. రాజధానికి భూములిచ్చిన రైతుల నిరసనల హోరు మధ్య సీఎం జగన్​ సెంటు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఆర్-5 జోన్‌లో 50 వేలకు పైగా పట్టాలిచ్చారు. దీనిపై సుప్రీం కోర్టులో వివాదం నడుస్తోంది. అంతిమ తీర్పునకు లోబడి మాత్రమే పట్టాలు చెల్లుబాటవుతాయని ధర్మాసనం పేర్కొంది. భవిష్యత్తులో తీర్పు ఎలా వచ్చినా వైసీపీకి ఇబ్బంది లేదు. లబ్దిదారులకు భూమి దక్కినా ఓట్లేస్తారు. దక్కకున్నా టీడీపీనే అందుక్కారణమని నిందిస్తే ఓట్లు రాలతాయి. వైసీపీ స్కెచ్​ని దీటుగా ఎదుర్కోవడంలో టీడీపీ కుదేలైంది. ఈ దెబ్బతో తాటికొండ, మంగళగిరి నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. ఇప్పుడు నారా లోకేశ్​ మంగళగిరిలో పోటీ చేస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన లే అవుట్లలో గుంటూరు, ఎన్టీఆర్​ జిల్లాలకు సంబంధించి 50,793 మంది పేద మహిళలకు పట్టాలిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం రూ.15 వేలకు పైగా విలువుంటుందని ప్రభుత్వం చెబుతోంది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయరనుకుంటే వెయ్యి రూపాయలకు కొనే నాథుడు కూడా ఉండడు. లబ్దిదారుల్లో బీసీలు 26,869 మంది, ఎస్సీలు 8,495 మంది, ఎస్టీలు 1,579 మంది, అగ్రవర్ణ పేదలు 13,850 మంది ఉన్నారు. జనాభాలో పదిశాతానికి మించని అగ్రవర్ణ పేదలకు 27.26 శాతం పట్టాలిచ్చారు. అదే ఎనిమిది శాతానికి పైగా ఉన్న ఎస్టీలకు 3 శాతం కూడా ఇవ్వలేదని పెదవి విరుస్తున్నారు.

తుది తీర్పునకు లోబడే..

ఆర్​-5 జోన్‌లో సెంటు భూమి పట్టాలకు సంబంధించి సుప్రీం కోర్టులో వివాదం నడుస్తోంది. ఈపాటికే ప్రభుత్వం లేఅవుట్ల ప్రక్రియను మొదలు పెట్టిందని చెప్పడంతో సుప్రీంగ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. అయితే తుది తీర్పునకు లోబడి పట్టాలు చెల్లుబాటు అయ్యేట్లు వాటిపై ముద్రించాలనే నిబంధన విధించింది. దీని వల్ల అధికార వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. ఇచ్చిన పట్టాలకు కోర్టు చట్టబద్దత కల్పిస్తే లబ్ధిదారులంతా ఓట్లేస్తారనే ధీమాతో ఉన్నారు. చెల్లుబాటు కాకుంటే అది టీడీపీ వల్లేనని బద్నాం చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం దక్కుతుందనే యోచనలో పార్టీ నేతలున్నారు. మంగళగిరిలో 35 వేలు, తాటికొండలో 15 వేల కుటుంబాలకు సెంటు పట్టా ఇవ్వడం ద్వారా ఈ రెండు నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోగలమనే విశ్వాసంతో వైసీపీ నేతలు ఉన్నారు.

మంగళగిరి నుంచి లోకేశ్​ పోటీ చేస్తారా?

ఆర్-5 జోన్లో ఇంటి స్థలాల పంపిణీని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రత్యేకించి అసైన్డ్​ భూములు ఇచ్చిన వాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. రాజధాని పరిసరాల్లో భూములు కొన్నవాళ్లు, కొని ల్యాండ్​ పూలింగ్‌కు ఇచ్చిన వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీళ్లే రైతుల్ని, పేదలను ముందు పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని అధికార పార్టీ అనుమానిస్తోంది. అమరావతిని అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం పేదల పేరుతో రాజకీయం చేయడంతో వాళ్లకు పుండుపై కారం చల్లినట్లుంది. ఈ వ్యతిరేకత మొత్తం టీడీపీకి లబ్ది చేకూరే అవకాశం లేకపోలేదు. వైసీపీ వ్యూహంతో నారా లోకేశ్​ మంగళగిరి నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమైంది. నిన్నమొన్నటిదాకా తాటికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వైసీపీకి ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీ ఎత్తుగడతో టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed