'ఆడబిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటాం'

by srinivas |   ( Updated:2022-11-25 14:54:31.0  )
ఆడబిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటాం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలపై హింసను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశ బిల్లును తీసుకువచ్చారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ బిల్లు వల్ల నిందితులకు త్వరితగతిన శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు. మంగళగిరి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళలపై హింస నివారణ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. సన్నిహితుల నుంచే మహిళలపై హింస ఎక్కువగా జరుగుతుందని ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి పేర్కొందని తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 నివేదిక ప్రకారం దేశంలోని ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు వారి భర్తల నుంచి శారీరక, లైంగిక, హింస ఎదుర్కొంటున్నట్లు వెల్లడైందని అన్నారు. కుటుంబ హింస, గృహహింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు అనేక సవాళ్ళ మధ్య మహిళలు ముందుకు అడుగులు వేస్తున్నారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. మహిళల చుట్ట ఉన్న ప్రపంచాన్ని, కుటుంబం, సమాజం మార్చకుండా మహిళలపై హింసను ఆపడం అసాధ్యమన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలతో మహిళలకు ఇంట, బయట కీలకమైన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ కొనియాడారు. దిశా యాప్ ద్వారా అరచేతిలో మహిళలకు రక్షణ వ్యవస్థను అందుబాటులో తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. నేరం జరిగిన వారం రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయటం, అతి త్వరగా శిక్షలు పడే విధంగా దిశ చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు. ఆడబిడ్డలను కంటికి రెప్పలా చూసుకునే ప్రతి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

Nara lokesh: మంగళగిరి బాధ్యతలపై సంచలన నిర్ణయం

Advertisement

Next Story

Most Viewed