Nadendla Manohar: పవన్ ఆశయాలకు వారే వారధులు

by srinivas |   ( Updated:2023-05-12 14:44:56.0  )
Nadendla Manohar: పవన్ ఆశయాలకు వారే వారధులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగిందంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని.. ఆ దిశగా అందరూ కలిసి పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. సమాజానికి ఉపయోగపడే రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఉండాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని, ఆ దిశగా వేసిన అడుగుల్లో అంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టిందని చెప్పారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తేనే ఇలాంటి కార్యక్రమం చేయగలమన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా జనసైనికుడు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉందని, ముఖ్యంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసి వారికి అండగా ఉండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నామని ఇందుకోసం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.

మన నాయకుడిని గెలిపించుకోవాలి

జనసైనికులు, జనసేన పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కార్యక్రమం వైసీపీ మొదలు పెట్టిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ, వార్డుల్లో పర్యటించి తొలగించిన ఓట్లు తిరిగి పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మనం రేపటి రోజున ప్రభుత్వంలోకి రావాలనరి. మన నాయకుడిని గెలిపించుకోవాలంటే మనందరం బాధ్యతగా పని చేయాలని సూచించారు. ‘ప్రతి మండలంలో నెలాఖరుకల్లా మండల కమిటీలు పూర్తి చేసుకోవాలి. సామాన్యుడు ప్రభుత్వాన్ని నిలదీయలేడు కనుక ఆ బాధ్యతను మనం తీసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి అవినీతిలో కూరుకుపోయారు. వారి అవినీతిని ఎండగట్టే విధంగా మన కార్యచరణ ఉండాలి. ఒక పేద మహిళ బిడ్డ చనిపోయిన బాధలో ఉంటే వారికి వచ్చే నష్టపరిహారంలో రూ.2 లక్షలు దోచుకోవడానికి ప్రయత్నించిన మంత్రి కూడా మన గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వారందరికీ బుద్ధి చెప్పే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చి మరి మన అధినాయకుడిపై దుష్ప్రచారం చేపట్టారు. ఇప్పుడు కూడా అదే దోరణిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి మనపై విషప్రచారం చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవాలి’. అని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

TG Venkatesh: ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed