ఏపీలో మళ్లీ ఎన్నికల హీట్..

by Rani Yarlagadda |   ( Updated:2024-10-02 05:20:16.0  )
ఏపీలో మళ్లీ ఎన్నికల హీట్..
X

దిశ ప్రతినిధి, గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. అప్పుడే రాజకీయ పార్టీలు హడావుడి మొదలు పెట్టాయి. అభ్యర్థులను ఫైనలైజ్ చేసి ఓటర్ల జాబితాలపై దృష్టి పెట్టాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయే మొట్ట మొదటి ఎన్నిక కావడంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. దీంతో ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయగా, అటు రాజకీయ పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఆలపాటికి లైన్ క్లియరేనా?

గత ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా టికెట్ కోల్పోయిన నేతలను బరిలోకి దించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాకు చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటును ఆలపాటి రాజా త్యాగం చేశారు. అక్కడ నుంచి జనసేన నంబర్ టు నాదెండ్ల మనోహర్ పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలోనే ఆలపాటికి సరైన ప్రాధాన్యతనిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందే ప్రకటించారు. దీంతో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయనకు ఇప్పటికే చెప్పినట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన రాజా ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టారు. పార్టీ అభిమానులు, అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారు. అధిష్టానం నుంచి అనుమతి వచ్చిందని మార్చిలో జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.

గౌతంకు టిక్కెట్ ఖాయమేనా..?

టీడీపీ ప్రయత్నాలు ఇలా ఉంటే మరోవైపు వైసీపీ కూడా బలమైన అభ్యర్ధిని బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన గౌతం రెడ్డిని జగన్ ఓకే చేశారని అధికారికంగా తేలింది. గుంటూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా అప్పుడే గౌతం రెడ్డి పర్యటించి ఇంఛార్జులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా తాడికొండ నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత భర్త దయా సాగర్ ఆధ్వర్యంలో సమావేశం కూడా ఏర్పాటు చేసి గౌతం రెడ్డిని పార్టీ నాయకులకు పరిచయం చేశారు.

నరసరావుపేటలో గౌతమ్ రెడ్డి ప్రచార సభ..

ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గౌతమ్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ జరిగింది. దీంతో గౌతంరెడ్డికే టికెట్ ఖాయమన్నది ఖరారైంది. దీంతో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికల్లో ఆలపాటి రాజా, గౌతం రెడ్డి పోటీ దాదాపు ఖాయమైనట్లే.. ఓ వైపు ఇరు పార్టీల నేతలు తమ మద్దతుదార్లను ఓటర్లుగా చేర్చుకుంటూ ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతూనే ఉన్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story