‘జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి’.. కలెక్టర్ కీలక ఆదేశాలు

by Jakkula Mamatha |
‘జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి’.. కలెక్టర్ కీలక ఆదేశాలు
X

దిశ ప్రతినిధి, బాపట్ల: అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ జె.వెంకట మురళి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో తయారు చేయాల్సిన ప్రగతి నివేదికలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరియు పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో పర్యాటక రంగానికి అనుకూలమైన వాతావరణం ఉందని సుదీర్ఘమైన 103 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన చెప్పారు.

జిల్లాలో మత్స్య సంపదకు ఆక్వా సంపదకు అన్ని వనరులు ఉన్నాయని పరిశ్రమలు స్థాపించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన చెప్పారు. జిల్లాలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదలు రాకుండా కరకట్ట అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కృష్ణ పశ్చిమ డెల్టా కాలువల మరమ్మత్తులు చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు.

జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సురక్షిత తాగు నీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్.ఇ అనంతరాజు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. వెంకటేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా అటవీశాఖ అధికారి భీమయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed