Withholding of pension: ‘సార్.. మీరే న్యాయం చేయాలి’.. బతికుండగానే రికార్డుల్లో చనిపోయినట్లుగా నమోదు!

by Jakkula Mamatha |
Withholding of pension: ‘సార్.. మీరే న్యాయం చేయాలి’.. బతికుండగానే రికార్డుల్లో చనిపోయినట్లుగా నమోదు!
X

దిశ, వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం వెలుగు చూసింది. నిక్షేపంగా బతికి ఉన్న మహిళను చనిపోయినట్లు గా చూపించడం, బీమా డబ్బులు చెల్లించడం, అనంతరం పింఛను నిలిపివేయడం ముక్కున వేలేసుకునేలా చేసింది. తాను జీవించే ఉన్న నెలలుగా పింఛను రాక, అవస్థలు భరించలేక బాధిత మహిళ ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుని ఆశ్రయించడంతో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వినుకొండ పట్టణం, సీతయ్య నగర్, వల్లపు శేషమ్మ 15 ఏళ్లుగా వితంతు పింఛను తీసుకుంటున్నారు. పింఛను డబ్బు ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కానీ 2023 అక్టోబర్‌ నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

అదే నెలలో బతికున్న శేషమ్మను చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు అయింది. ప్రమాద బీమా పేరిట నామినీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు. తర్వాత నెల నుంచి ఆమె పింఛన్ ఆగిపోయింది. అప్పట్నుంచి బాధిత మహిళ కన్నీటి పర్యంతం అవుతూ ఎంతమందితో కష్టం చెప్పుకున్న పట్టించుకునేవారు లేక పోయారు. చివరకు ఇటీవలే బాధిత మహిళ చీఫ్‌విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల్ని ఆశ్రయించడంతో వినుకొండ మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆమె చనిపోయినట్లుగా నమోదు కావడం, ప్రమాద బీమా జమ అన్నింటిపై విచారణ జరిపించాలని ఆదేశించారు. శేషమ్మ కు న్యాయం చేయాలని, పింఛను పునరుద్ధరించాలని సూచించారు. ఈ మేరకు జీవీ ఆంజనేయులుని కలిసిన బాధిత మహిళ శేషమ్మ ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తనలా మరెవరికి అన్యాయం జరగకుండా చూడాలని ఆమె వేడుకున్నారు.

Advertisement

Next Story