‘ముందస్తు’పై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2023-04-10 15:11:10.0  )
‘ముందస్తు’పై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘వచ్చే ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీదే. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణే అందుకు నిదర్శనం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రేపు ఎన్నికల్లో రాబోతున్నాయి. కాబట్టి ప్రతీ కార్యకర్త, ప్రతీ నాయకుడు కష్టపడాలి.’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిశీలకులు కార్యకర్తలు, నేతలతో సమన్వయంతో కలిసికట్టుగా పని చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పాటుపడాలని ఆదేశించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ భవిష్యత్ కార్యచరణలపై దిశానిర్దేశం చేశారు.

కుటుంబ సాధికార సారథుల నియామకం పూర్తి చేయాలి

ఎన్నికలకు ఎంతో సమయం లేదని అచ్చెన్నాయుడు నియోజకవర్గ ప్రజలకు సూచించారు. నియోజవకవర్గాల్లో పార్టీని బలోపేతంచేయడంపై నియోజకవర్గ పరిశీలకులు ప్రధానదృష్టిపెట్టాలి అని సూచించారు. ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై, కుటుంబసాధికార సారథుల పనితీరుపై పరిశీలకులు దృష్టిపెట్టాలి అని సూచించారు.కుటుంబ సాధికార సారథుల పని కేవలం 20శాతంమాత్రమే పూర్తైంది. మిగిలిన 80శాతాన్ని వీలైనంతత్వరగా పూర్తిచేయాలి అని పిలుపునిచ్చారు. 2024ఎన్నికల్లో విజయంసాధించాలంటే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంచేయాలి అని అచ్చెన్నాయుడు సూచించారు.


ఎన్నికలెప్పుడైనా పోటీకి సిద్ధం

సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నియోజకవర్గాల పరిశీలకులకు ఉందని చెప్పారు. రాష్ట్రస్థాయినేతలు మరింత కష్టపడాలని అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షసపాలనను అంతమొందించాలంటే పార్టీనేతలు, కార్యకర్తలు సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేయాలని అప్పుడే అది సాధ్యమవుతుందని జోస్యం చెప్పారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో ప్రజలకు బాగా దగ్గరయ్యారని, ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులు, మహిళల సమస్యలపై నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్యస్పందన వస్తోందని చెప్పుకొచ్చారు. దాన్నికూడా జనంలోకి తీసుకెళ్లేలా నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో పనిచేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, కె.ఎస్ జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ , మాజీ ఎమ్మెల్యే డా. అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

YS Avinash Reddy: ఆ వీడియోలు, ఆడియోలు ఇవ్వండి..!

Advertisement

Next Story