ఐసీఐసీఐ బ్యాంక్ లో కోట్లలో స్కాం.. గగ్గోలు పెడుతున్న బాధితులు

by Rani Yarlagadda |
ఐసీఐసీఐ బ్యాంక్ లో కోట్లలో స్కాం.. గగ్గోలు పెడుతున్న బాధితులు
X

దిశ, ప్రతినిధి నరసరావుపేట: చిల‌క‌లూరిపేట‌ పట్టణంలోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో ఎఫ్డీ, బంగారు ఆభరణాల రుణాలలో రూ.50 కోట్ల స్కాం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి ప్రధాన సూత్రధారిగా గతంలో ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసిన వ్యక్తితో పాటు మరికొందరు సిబ్బంది పాత్ర ఉన్నట్టుత అనుమానిస్తున్నారు. గురువారం బ్యాంక్‌లో బాధితులు ఆందోళనకు దిగడంతో విషయం బయటకు పొక్కింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వ‌డ్డీ ఈ నెల జ‌మకాకపోవడంతో సుమారు 30 మంది బ్యాంకుకు చేరుకున్నారు. ఒరిజిన‌ల్ బాండ్లను తీసుకొచ్చి చూపగా, అవి రికార్డుల్లో న‌మోదు కాలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అలాగే, తాకట్టు పెట్టిన బంగారం విష‌యంలోనూ గోల్‌మాల్ జ‌రిగింద‌ని తెలిసింది.

చిలకలూరిపేటలో సంచలనం..

ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో, ఖాతాదారులు ఒక్కొక్కరుగా బ్యాంకు వచ్చి తమ ఎఫ్డీలు, బంగారు రుణాలపై సమాచారం సేకరించే పనిలో పడిపోయారు. కొందరు బాధితులు అర్బన్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న న‌ర‌స‌రావ‌పేట డీఎస్సీ కే నాగేశ్వ‌ర‌రావు చిలకలూరిపేటకు చేరుకున్నారు. ఆయన పర్యవేక్షణలో పోలీసు అధికారులు విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు. మోస‌పోయిన బాధితులు ఇంకా ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తుంది. అవ‌క‌త‌వ‌క‌లు వెలుగు చూసిన నేప‌థ్యంలో బ్యాంకు జోనల్ మేనేజ‌ర్ సందీప్ మెహ‌రా బ్రాంచికి చేరుకొని రికార్డులు తనిఖీలు చేయిస్తున్నారు.

రికార్డులు పరిశీలిస్తున్నాం: డీఎస్పీ

చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్రాంచ్‌లో స్కాం వెలుగులోకి రావడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహిస్తున్నామని నరసరావుపేట డీఎస్పీ కే.నాగేశ్వర రావు తెలిపారు. ఇప్పటివరకు రూ.7కోట్ల మేర గోల్ మాల్ జరిగినట్టు తెలుస్తున్నదని అన్నారు. ఇంకా ఫిర్యాదుదారులు చాలా మంది ఉన్నారన్నారు. బ్యాంక్ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారని అన్నారు. గతంలో ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన నరేశ్ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఇతను నరసరావుపేట, విజయవాడ బ్రాంచ్‌లలో పని చేశాడని అన్నారు. విజయవాడలో ఓ మహిళను మోసం చేసి సస్పెండ్ అయ్యాడని, అప్పటి నుంచి అతని జాడ తెలియలేదని తెలిపారు. బ్యాంకు సిబ్బంది కూడా కొందరు సహకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు ఇంకా ఇవ్వలేదని, తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed