ఆ ప్రాంతంలో చెల్లాచెదురైన క్యాడర్‌.. ఒక్కటి చేయడంపై మంత్రుల ఫోకస్

by karthikeya |
ఆ ప్రాంతంలో చెల్లాచెదురైన క్యాడర్‌.. ఒక్కటి చేయడంపై మంత్రుల ఫోకస్
X

దిశ ప్రతినిధి, కర్నూలు: ఆలూరు టీడీపీపై మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఫోకస్ పెట్టనున్నారా? వర్గ విభేదాలతో చెల్లాచెదురైన క్యాడర్‌ను మళ్లీ కలిపే ప్రయత్నం చేయనున్నారా? మరో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో పాటు ప్రస్తుత ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌తో కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మూడ్రోజుల క్రితం దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్, సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులుతో కలిసి దేవరగట్టు మాళ సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న సందర్భంలో చేసిన ప్రకటన పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఆలూరులో టీడీపీకి పూర్వ వైభవం రానుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

1955లో నియోజకవర్గంగా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు 1955లో నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2024 ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల లిస్టు ప్రకారం నియోజకవర్గంలో 2,53,927 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 1,27,600 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,26,273 మంది ఉన్నారు. థర్డ్ జెండర్లు 54 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 1,327 మంది అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 9 పర్యాయాలు, స్వతంత్ర పార్టీ ఒక సారి, టీడీపీ 3 పర్యాయాలు, వైసీపీ 3 పర్యాయాల చొప్పున విజయం సాధించాయి.

పార్టీ బలోపేతానికి కసరత్తు..

నేతల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా అక్కడ 35 ఏళ్లుగా టీడీపీ గెలుపు పిలుపును అందుకోలేకపోతోంది. ఫలితంగా ఇంచార్జిని మార్చాలని తెలుగు తమ్ముళ్లు జిల్లా కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరి గుంతకల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు టీడీపీపై ఫోకస్ పెట్టారు. మూడ్రోజుల క్రితం దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్, సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులుతో కలిసి దేవరగట్టు మాళ సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలో చేసిన ప్రకటన, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆ సమయంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. రానున్న రోజుల్లో ఆలూరు టీడీపీని మరింత బలోపేతం చేస్తానని, ప్రస్తుతం ఉన్న నేతలు ఎవరికి వారుగా ఉన్నారనే వ్యాఖ్యలు చేశారు.

అధిష్టానం మదిలో ఏముందో..

చాలా మంది వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీ లు, ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ తాను టీడీపీలో చేరుస్తానని గుమ్మనూరు కీలక ప్రకటన చేశారు. అయితే అక్కడ ఇంచార్జిగా మాజీ మంత్రి కేఈ. ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, మాజీ ఇంచార్జి వైకుంఠం శివప్రసాద్ ల పేర్లు తెరపైకొచ్చాయి. అధిష్టానం మాత్రం మొదటి నుంచీ పార్టీ కోసం కష్టపడుతున్న వైకుంఠం శివప్రసాద్‌కు ఇస్తుందా?, లేక మాజీ మంత్రి కేఈ. ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలకు ఇస్తుందా? అని నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన సోదరుడిని ఇంచార్జిగా నియమించాలనే యోచనలో ఉన్నట్లు చర్చలు జోరందుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed