గుడ్ న్యూస్: డీకే పట్టాపై కీలక మార్గదర్శకాలు జారీ

by Seetharam |
AP government
X

దిశ, డైనమిక్ బ్యూరో : డీకే పట్టాపై వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.డీకే పట్టాపై యాజమాన్య హక్కుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.డీకే పట్టాలు జారీ అయి పదేళ్లు దాటితే వాటిని నిషేధిత జాబితా (22ఏ) నుంచి తొలగించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. నిషేధిత జాబితా నుంచి తొలగించే డీకే పట్టాల లబ్ధిదారుల వివరాలు ఏటా ఆగస్టు 5న ప్రకటించాలని జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అయితే చెరువులు, కాలువలు, శిఖం భూముల్లో డీకే పట్టాలపై ఆంక్షలు విధించింది. ఆ డీకే పట్టాలను నిషేధిత జాబితా నుంచి తొలగించ వద్దంటూ ఆ మార్గదర్శకాల్లో కోరింది. అంతేకాదు ఇలాంటి స్థలాల్లో డీకే పట్టాలను పొందిన లబ్ధిదారులకు ఎటువంటి యాజమాన్య హక్కులు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే డీకే పట్టాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం ఈఏడాది జూలై 31న ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఆర్డీవో, జేసీ,కలెక్టర్‌లకు కీలక బాధ్యతలు

డీకే పట్టాలు నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఏళ్ల తరబడి ఆడీకే పట్టా భూముల్లో ఉంటున్న లబ్ధిదారుల వివరాలను సేకరించే బాధ్యత వీర్వోలదేని తేల్చి చెప్పింది.అసైన్డ్‌ కమిటీ సమావేశ మినిట్స్‌ ఆధారంగా ఆ స్థలంలో పట్టాదారుడు ఉన్నారా? లేక వారి వారసులు ఉన్నారా అన్నది గమనించాలి అని స్పష్టం చేసింది. పట్టాలు జారీ అయిన ప్రాంతం చెరువులు, కాలువలు పరిధిలో ఉందా లేదా అనేది పరిశీలించాలని సూచించింది. అంతేకాదు నిషేధిత జాబితా నుంచి ఆ డీకేపట్టాలను తొలగించేందుకు గల అర్హతలను ఒక నివేదికలో పొందుపరచి దాన్ని తహశీల్దార్‌కు అందజేయాలని సూచించింది. అయితే తహశీల్దార్ ఆ నివేదికను పరిశీలించి గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రకటించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అలాగే ఈ అంశంపై వారం రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించడం.. చర్యలు తీసుకోవడం జరగాలని స్పష్టం చేసింది. ఈ జాబితాలను ఆర్డీఓ, జేసీ, కలెక్టర్‌ పరిశీలించాలని తెలిపింది. డీకే పట్టాలు నిషేధిత జాబితా నుంచితొలగించేదుకు అర్హమైనవని ఆ అధికారులు భావిస్తే... కలెక్టర్‌ జిల్లా రిజిస్ట్రార్‌కు సిఫార్సు చేయాలి అని డీకే పట్టాలపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed