బల్క్ డ్రగ్ పార్క్‌కు నిధులు.. మంత్రి భగవంత్‌ ఖుబా క్లారిటీ!

by Sathputhe Rajesh |
బల్క్ డ్రగ్ పార్క్‌కు నిధులు.. మంత్రి భగవంత్‌ ఖుబా క్లారిటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయదలచిన బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా వెల్లడించారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లో మౌలిక వసతుల కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

దేశంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ల ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ఫార్మాసూటికల్స్‌ విభాగం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విశాఖలో ఎయిర్‌ కార్గో టెర్మినల్‌, విశాఖ పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ వంటి రవాణా వసతులు సిద్ధంగా ఉన్నందున ఫార్మా కంపెనీలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

ఈ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ద్వారా దేశీయ వినియోగంతోపాటు, ఎగుమతులకు అవసరమైన మందుల తయారీకి అనువైన వాతావరణ పరిస్థితుల కల్పనే ఈ పథకం ఉద్దేశమని వెల్లడించారు. ఈ పథకం మార్గదర్శకాలను అనుసరించి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమలకు ఫార్వార్డ్‌, బాక్‌వార్డ్‌ లింకేజీతో మద్దతుతో కనెక్టివిటీని కల్పించే అవకాశాల ప్రాతిపదికపైనే వాటిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయం జరిగిందని రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed