రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో కీలక ట్విస్ట్.. నిందితుడిగా మాజీ మంత్రి

by Mahesh |
రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో కీలక ట్విస్ట్.. నిందితుడిగా మాజీ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్, అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు.. సంచలనంగా మారాయి. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ గోదాములో దాదాపు 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయం అయినట్లు అధికారులు గుర్తించి విచారణ చేపడుతున్నారు. కాగా ఈ కేసుపై కోర్టును ఆశ్రయించిన జయసుధకు ఊరట లభించింది. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ఎవరు ఊహించని విధంగా మరో ట్విస్ట్ నెలకొంది. రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ని పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఆయనను ఏ6 నిందితుడిగా పోలీసులు చేర్చడం సంచలనంగా మారింది. కాగా ఇదే కేసులో గతంలో పేర్ని నాని, ఆయన కుమారుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.

కొనసాగుతున్న అరెస్టుల పర్వం

378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏ1 నిందితురాలు పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పై ఉండగా.. సోమవారం మరో నలుగురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పర్చగా వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో నిందితులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించి కృష్ణా జిల్లా కోర్టుకు తరలించారు. రిమాండ్ కు తరలించిన నిందితుల్లో సివిల్‌ సప్లై అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, గోడౌన్‌ మేనేజర్‌ మానస తేజ, డీలర్‌ ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed