బీజేపీలో చేరిన మాజీ సీఎం.. కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్

by Rajesh |
బీజేపీలో చేరిన మాజీ సీఎం.. కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని వెల్లడించారు.

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరటం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సమావేశమై రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై చర్చిద్దామని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో రాష్ట్రంలో బీజేపీ మరింత శక్తివంతమై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

అదే తరుణంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఆరా తీసింది. పార్టీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చింది. బీజేపీ అగ్రనాయకత్వం హామీతో ఇటీవలే కాంగ్రెస్‌కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఆపై కొన్నాళ్ల పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీచేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అనంతరం ఆ పార్టీని రద్దు చేసి తిరిగి సొంతగూటికి చేరారు. తాజాగా బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ పై కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్!

ఈ సందర్భంగా మీడియాతో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ వీడతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోయిందన్నారు. చేసిన తప్పులు ఏంటో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు పవర్ మాత్రమే కావాలన్నారు.

కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. ఓటముల నుంచి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవడం లేదన్నారు. 1952 నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. మోడీ అమిత్ షా డైరెక్షన్ బాగుందన్నారు. మాజీ సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధిష్టానం ఏ హోదా ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మార్చి 12న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్ : నేడు కాషాయ కండువా కప్పుకోనున్న మాజీ సీఎం

Next Story

Most Viewed