Tammileru Reservoir:తమ్మిలేరు రిజార్వయర్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-08 11:49:59.0  )
Tammileru Reservoir:తమ్మిలేరు రిజార్వయర్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..!
X

దిశ, ఏలూరు:తమ్మిలేరు వరద నీటితో ఉరకలేస్తోంది. ఏలూరు నగరం చుట్టూ భారీగా వరద నీరు పారుతోంది. వరద నీరు తంగెళ్ళమూడి లోని పల్లపు ప్రాంతం నివాసాలలోకి వద్దకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి ఎగువ తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి తాలూకా నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో డ్యామ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్‌లోనికి గురువారం మధ్యాహ్నం 12-00 గంటల సమాచారం ప్రకారం 6393 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వుంది. దీంతో రిజర్వాయర్ నుంచి 8893 క్యూసెక్కులు మూడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు.

రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 349.36 అడుగులు, గోనెల వాగు బేసిన్ 349.13 అడుగులు ఉందని ఎఇఇ పరమానందం చెప్పారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.003 TMC లుగా వుందని పరమానందం తెలిపారు.మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సందర్భంగా తమ్మిలేరు ప్రవాహ ప్రాంతంలో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా తమ్మిలేరు వరద నీరు ఏలూరు నగరంలోని శనివారపుపేట కాజ్ వే మీదుగా రెండడుగుల ఎత్తులో ప్రవహిస్తుండడంతో అమీనా పేట – శనివారపుపేట మధ్య కాజ్ వే మీద ట్రాఫిక్ ను నిలిపివేశారు.

తమ్మిలేరు కు వరద నీరు వస్తుండడంతో అమీనా పేట వద్ద కాజ్ వే పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా శనివారపుపేట వైపు నుంచి వచ్చే వాహనదారులు సెంట్ జేవియర్ స్కూల్ మీదుగా బస్టాండ్ వైపు వెళ్లాలని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచించారు. అమీనా పేట నుంచి శనివారపుపేట వెళ్లే వాహనాలు ఏటిగట్టు మీదుగా న్యూ బస్టాండ్ నుండి టిటిడి కళ్యాణ మండపం మీదుగా వెళ్లేలా ట్రాఫిక్ ను మళ్లించినట్లు వివరించారు. కాజ్ వే వద్ద పరిస్థితి ని డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సిహెచ్ దేవ ప్రకాష్, ఏలూరు ఆర్డీవో ఎం షేక్ ఖాజావలి, డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ అర్జున్, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు.

డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కాజ్ వే వద్ద ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వరద తగ్గే వరకు ప్రజలు పోలీసు హెచ్చరికలను పాటించాలని కోరారు. తమ్మిలేరులో ఇటీవల నీటి ప్రవాహం లేకపోవడంతో తూడు, గుర్రపు డెక్క, ముళ్లు చెట్లు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు వరద ఉధృతిగా ఉండడంతో కొత్త బస్టాండ్ వద్ద బ్రిడ్జి దిగువన పేరుకున్న గుర్రపు డెక్కను పొక్లెయినర్లతో ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. పొక్లెయినర్లతో బ్రిడ్జి మీదుగా పని చేస్తుండడంతో జీఎన్టీ రోడ్‌లో కొత్త బస్టాండ్ వైపు, ఇటు రెడ్డి కాలేజీ వైపు ట్రాఫిక్ రెండు కిలోమీటర్ల మేరకు నిలిచిపోయింది.

Advertisement

Next Story