సీఎం జగన్‌తో చర్చలు సఫలం.. హర్షం వ్యక్తం చేస్తున్న ఇండస్ట్రీ

by Disha News Desk |
సీఎం జగన్‌తో చర్చలు సఫలం.. హర్షం వ్యక్తం చేస్తున్న ఇండస్ట్రీ
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ సమస్యల పట్ల ఎంతో సానుకూలంగా స్పందించారని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తమ సమస్యలు విని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. గురువారం చిరంజీవి నేతృత్వంలోని బృందం సీఎం జగన్, మంత్రి పేర్నినాని, ప్రభుత్వ కమిటీ పెద్దలతో సమావేశమైంది. చిరంజీవితో పాటు హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటుడు, నిర్మాత నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. వీరంతా బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకొని.. ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

ఈ భేటీలో సినీ ప్రముఖులు ప్రధానంగా ఏడు అంశాలపై చర్చించారు. '1. సినిమా టికెట్ల ధరల పెంపు 2. ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ 3. జీఎస్టీ మినహాయింపు 4. ఆన్లైన్ టికెట్ అమలు ఫిల్మ్ ఛాంబర్‌కు అప్పగించడం, 5. పార్కులు , ప్రభుత్వ , చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్‌లకు అద్దె మినహాయింపు 6. చిన్న , మధ్య సినిమాలకు కూడా ఐదో షోకు అనుమతి 7. టాలీవుడ్‌కు పరిశ్రమ హోదా, ఏటా నంది అవార్డులు' అంశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ప్రతిపాదనల పట్ల సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుంది : మెగాస్టార్ చిరంజీవి

'ముఖ్యమంత్రితో చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయి. సినిమా పరిశ్రమపై గత కొద్దికాలంగా నెలకొన్న సమస్యలకు ఈ రోజుతో శుభం కార్డు పడింది. చిన్న సినిమాలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇకపోతే ఐదో షోకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందుకు మేము కూడా మా వంతు సహకారం అందిస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని భావిస్తున్నాం' అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

జగన్‌పై రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చలు ఎంతో సంతృప్తి నిచ్చాయని నటుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి, దర్శకుడు రాజమౌళి అన్నారు. చిన్న సినిమాలను కాపాడాలని తాను ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. అందుకు ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరోవైపు సినీ పరిశ్రమ అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ చాలా ఆలోచన చేస్తున్నారని దర్శకుడు రాజమౌళి అన్నారు. సీఎం దగ్గర సినీ పరిశ్రమపై అద్భుత ఆలోచనా విధానం ఉందని రాజమౌళి ప్రశంసించారు.

చర్చలు చాలా రిలీఫ్ ఇచ్చాయి : హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్

సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా నెలకొన్న గందరగోళానికి సీఎం వైఎస్ జగన్ నేడు ఫుల్ స్టాప్ పెట్టారని టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్‌తో టాలీవుడ్ టీం చర్చలు సఫలమైనట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ప్రభాస్, మహేశ్ బాబులు థ్యాంక్స్ చెప్పారు. ఈ చర్చలు చాలా రిలీఫ్ ఇచ్చాయని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. ఈ చర్చలకు పూనుకున్న మెగాస్టార్ చిరంజీవి, మంత్రి పేర్ని నానికి హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్‌లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story