- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతి రైతుల పాదయాత్ర... వెల్లువెత్తుతున్న విరాళాలు
దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర స్వల్ప ఉద్రిక్తతల నడుమ మూడో రోజు పూర్తి చేసుకుంది. దుగ్గిరాల నుంచి ప్రారంభమైన పాదయాత్రకు స్థానికులు పూలు చల్లి మద్దతు తెలిపారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొనే రైతులకు పోలీసులు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, తమకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం ప్రకటన హర్షణీయం
విభజన చట్టం ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే నిధులిస్తామని కేంద్రం ప్రకటన చేయడాన్ని రైతులు స్వాగతించారు. యాత్ర ప్రారంభమైన రెండోరోజే ఈ ప్రకటన రావడం శుభపరిణామని కొనియాడారు. కేంద్రం కూడా అమరావతే ఏకైక రాజధానిగా గుర్తించిందంటూ హర్షం వ్యక్తంచేశారు. యాత్ర దుగ్గిరాల నుంచి నందివెలుగుకు చేరుకోగానే స్థానిక మహిళలు పూలతో ఆహ్వానం పలికారు. యాత్రలో పాల్గొన్నవారికి మజ్జిగ, మంచినీరు అందించారు. ప్రజల సహకారానికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఓ సామాజిక వర్గానికి చెందిన రైతులు మాత్రమే యాత్ర చేస్తున్నారని కొందరు మంత్రులు మాట్లాడటంపై రైతులు మండిపడ్డారు. యాత్రకు వచ్చి చూస్తే ఎన్ని కులాలు, మతాలు ఉన్నాయో తెలుస్తుందని సవాల్ చేశారు.
ఐతానగర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తెనాలి ఐతానగర్‌కు చెందిన రైతులు, స్థానికులు.. రైతుల వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ వంతుగా 5 లక్షల 51 వేల రూపాయల చందా అందజేశారు. ఈ సందర్భంగా యాత్ర తమ ప్రాంతం నుంచి వెళ్లాలని అభ్యర్థించారు. అయితే పోలీసులు మాత్రం అనుమతించలేదు. స్థానిక ఎమ్మెల్యే నివాసం ఉన్నందున ఘర్షణ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం యాత్ర కొనసాగించిన రైతులు స్థానిక ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు పెదరావూరు వద్ద యాత్రను ముగించారు. సుమారు 15 కిలోమీటర్ల మేర మూడోరోజు పాదయాత్ర జరిగింది. గురువారం పెదరావూరు నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
విరాళాల.. వెల్లువ
అమరావతి మహాపాదయాత్ర చేస్తున్న బృందానికి అధికంగా విరాళాలు వస్తున్నాయి. పెదవడ్లపూడి గ్రామస్తులు రూ.4 లక్షలను అమరావతి జేఏసీ ప్రతినిధి ఆరే శివారెడ్డికి టీడీపీ నాయకులు జవ్వాది కిరణ్‌చంద్, మాదల రమేశ్, అన్నే చంద్రశేఖర్, బోయపాటి రవి, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు అందజేశారు. పాదయాత్రికులకు విందు కూడా ఏర్పాటుచేశారు. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కంతేటి నాగేశ్వరరావు, అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు తదితరులు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి రూ.10,116లను విరాళంగా అందజేశారు. పాదయాత్రకు ఆది నుంచి అండగా ఉన్న సీపీఐ పార్టీకి చెందిన పెదవడ్లపూడి గ్రామ కమిటీ రూ.లక్ష విరాళాన్ని అందించింది. ఇక గుంటూరుకు చెందిన శ్రీవెంకటేశ్వర వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ సభ్యులు రూ.1,51,116 అందజేశారు. అసోసియేషన్ సభ్యులు దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు వద్ద అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, తిరుపతిరావులకు ఈ మొత్తాన్ని అందజేశారు.
Also Read : జగన్ ఫోకస్ ఈ అంశంపైనే.. అందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్