బెంబేలెత్తిస్తున్న అసమ్మతి సెగలు.. క్షేత్ర స్థాయిలో కలవని పొత్తులు

by GSrikanth |
బెంబేలెత్తిస్తున్న అసమ్మతి సెగలు.. క్షేత్ర స్థాయిలో కలవని పొత్తులు
X

గత ఎన్నికల్లో జనసేన కారణంగా అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా కలిసింది. ఇక తమకు తిరుగులేదనుకుంటున్న తరుణంలో కూటమి పార్టీల్లో అసమ్మతి సెగలు బెంబేలెత్తిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయా పార్టీల అధినాయకుల ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇలాగైతే ఓట్ల బదిలీ కష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. బీజేపీ ఒక స్థానంలో తలపడుతోంది. మిగతా అన్నింటిలో టీడీపీ బరిలో నిలిచింది. ఏలూరు పార్లమెంటు నియోకవర్గానికి టీడీపీ పోటీ చేస్తుండగా నర్సాపురానికి బీజేపీ అభ్యర్థి రంగంలో నిలిచారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాలకు గాను మరో ఐదు సెగ్మెంట్లలో జనసేన పోటీ చేస్తోంది. రాజమండ్రి పార్లమెంటుతోపాటు అనపర్తిలో బీజేపీ బరిలోకి దిగింది. పిఠాపురంలో జనసేన నేతలు టీడీపీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రిలో ఇటీవల కూటమి పార్టీల సమన్వయ సమావేశం పెడితే టీడీపీ నేతలు ఏకంగా ఫ్లెక్సీలనే చించేశారు. ఉండిలో టీడీపీ అలకలు తీరలేదు. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పట్టు వీడడం లేదు.

పవన్ తప్పటడుగులు..?

టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ఎన్నికలకు ఆర్నెల్ల కిందటే పొత్తు గురించి సంకేతాలు ఇచ్చారు. ఇరువురు నేతలు రెండుమూడు సార్లు కలుసుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడం అవసరమని గుర్తించారు. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఆచరణలో అమలు చేయలేకపోయారు. జనసేనాని కాపు సామాజిక వర్గాన్ని తన వెనుక ర్యాలీ చేసుకోవడం, అభిమానులను పార్టీ కార్యకర్తలుగా మల్చుకోవడం కోసం కొన్ని తప్పటడుగులు వేశారు. సీఎం అవడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించి గందరగోళంలో పడేశారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ మరింత​ పెరిగింది.

కోడ్ వచ్చినా కానరాని సఖ్యత..

పొత్తు గురించి బీజేపీ చివరిదాకా నాన్చింది. అప్పటిదాకా కమలనాధులపై గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు పొత్తు కుదరడంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. బీజేపీ పోటీ చేసే చోట్ల అవసరమైతే కాంగ్రెస్​ కైనా ఓటేస్తాం తప్ప కాషాయపార్టీకి వేసేది లేదంటున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ బాద్​ షాలున్నారని, జగన్​, మోడీ-షాల కనుసన్నల్లోనే ఈ పన్నాగం పన్నినట్లు టీడీపీ శ్రేణులు ఇప్పటికీ భావిస్తున్నాయి. ఎన్నికల కోడ్​ వచ్చినా మూడు పార్టీల కూటమి మధ్య సఖ్యత ఓ దారికి రాలేదు. గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల చాలా సీట్లను కోల్పోయింది. ఈ దఫా జనసేన, బీజేపీ కలవడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధిక్యతను సాధించాలని భావించింది. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల అసమ్మతి సెగలు టీడీపీ లక్ష్యాన్ని గండికొట్టే పరిస్థితులు నెలకొన్నాయి.

వారు ఈసారి వైసీపీకి ఓటు వేయరా?

మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార వైసీపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అర్బన్​ ప్రాంతాల్లోని మధ్య తరగతి వర్గం వైసీపీని వ్యతిరేకిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి గిరిజన, ఎస్సీ నియోకవర్గాల్లో తన పట్టును కోల్పోలేదు. ప్రధానంగా మహిళలు ఇప్పటికీ వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మద్యం ప్రియులు ఈ దఫా వైసీపీకి ఓటేసే అవకాశమే లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ సింగిల్​ డిజిట్​కు పరిమితం కావాల్సి వస్తుందనే ప్రచారం నుంచి గణనీయమైన సీట్లు సాధించుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed