Pawan Kalyan:‘వచ్చే ఐదేళ్లలో శాఖను బలోపేతం చేస్తా’.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Pawan Kalyan:‘వచ్చే ఐదేళ్లలో శాఖను బలోపేతం చేస్తా’.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అటవీ శాఖలో అమరులైన సిబ్బందికి ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. గుంటూరు నగరంపాలెంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. అటవీ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం బాధ్యత మనపై ఉందన్నారు. భారతదేశం వసుదేక కుటుంబం అని అన్నారు. ఈ భూమి మనుషులకే కాదు అన్ని ప్రాణులకు నివాసం అని తెలిపారు. మరోవైపు వృక్షాలను కూడా సంరక్షించుకోవాలసిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అటవీ శాఖలో తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఏ రాజకీయ నాయకుడైనా వారి కాళ్లకు బంధాలు వేయకుండా పనిచేసుకోనివ్వాలని సూచించారు. అటవీ శాఖలో కొంత సిబ్బంది కొరత ఉందన్నారు. నిధులు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నప్పటి నుంచి నాకు ప్రకృతి అంటే ఇష్టం అన్నారు. అటవీ శాఖను తాను ఎంచుకోవటానికి కూడా ఇదో కారణమని తెలిపారు.

అటవీ సంరక్షణ నా హృదయానికి దగ్గర అయిందని తెలిపారు. వన్యప్రాణులను, వృక్ష సంపదను సంరక్షించే క్రమంలో ఎంతోమంది అధికారులు తమ ప్రాణాలను బలిదానం చేశారని గుర్తు చేశారు. మన ఏపీకి సంబంధించి 23 మంది ప్రాణాలు త్యాగం చేశారని తెలిపారు. వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఈరోజు అటవీశాఖ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ధైర్యసాహసాలను అందించేందుకు ఇటువంటి సంస్మరణ దినోత్సవాలను జరుపుకోవాలన్నారు. ఈ శాఖ నా చేతిలో ఉన్నంతకాలం ఉన్నతాధికారులకు సంపూర్ణ అధికారాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అటవీ శాఖలో అమరులైన వారి కుటుంబాలకు ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సేకరించేందుకు చర్యలు చేపడతానన్నారు. అమరులైన సిబ్బంది పేర్లను అటవీ శాఖ బ్లాకు పెడతామన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు పరిశీలిస్తామని తెలిపారు. ఈ ఐదేళ్లలో అటవీ శాఖలో సాధ్యమైనన్ని సంస్కరణలు తీసుకు వస్తారని పవన్ అన్నారు. కేంద్రంతో మాట్లాడి అదనపు నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాను అన్నారు. అటవీ శాఖలో అమరుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ సత్కరించారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అటవీ శాఖలో మెరుగైన ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed