6 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాసులు.. టెండర్లకు టైం వచ్చింది

by karthikeya |
6 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాసులు.. టెండర్లకు టైం వచ్చింది
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాసుల నిర్మాణానికి సర్కారు మరో ముందడుగు వేయనుంది. నెల రోజుల్లో టెండర్లు పిలవడానికి కసరత్తు చేస్తోంది. ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణానికయ్యే రూ.826 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడంతో పాటు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి మార్గాల్లో వెళ్లేవారికి ఉపశమనం లభించే అవకాశముంది.

డీపీఆర్ స్క్రూటినీ తర్వాత సర్కారుకు కన్సల్టెన్సీ రిపోర్టు

కేబీఆర్ పార్కు చుట్టూ 6 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాసులను నిర్మించడానికి రెండు ప్యాకేజీల్లో రూ.826 కోట్లకు డీపీఆర్ తయారుచేశారు. డీపీఆర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, డీపీఆర్‌కు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలపై స్క్రూటినీ చేయడానికి ‘ఎయిటీస్’ అనే కన్సల్టెన్సీని నియమించారు. రెండు ప్యాకేజీల్లోని జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులకు సరైన విధానంలో అంచనాలు తయారు చేశారా? ఏమైనా పొరపాట్లు జరిగాయా? అనే విషయాలపై కన్సల్టెన్సీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఆ రిపోర్టుపై జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు చర్చించడంతో పాటు సర్కారు దృష్టికి తీసుకెళ్లి నెలరోజుల్లో ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో జీహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనుంది.

అన్ని పనులు కాంట్రాక్టరే..

ఈపీసీ టెండర్ల ద్వారా ఎంపికైన కాంట్రాక్టరే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రాజెక్టుకు సంబంధించిన ఏరియాలో సర్వే చేయడంతో పాటు డిజైన్ తయారు చేయాలి. ఆ తర్వాత సాయిల్ టెస్టులు, అనంతరం ప్రాజెక్టు పనులు చేపట్టాల్సి ఉంటుంది. అందుకు ముందు కాంట్రాక్టర్ రూపొందించిన డిజైన్‌ను జీహెచ్ఎంసీ ఆఫీసర్లు చెక్ చేసి ఆమోదించిన తర్వాతే పనులు షురూ చేయాలి.

పీఎంసీ ఏర్పాటు

టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన నాటి నుంచి పూర్తి చేసే వరకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ)ని స్వతంత్ర ఇంజినీరింగ్ కంపెనీతో ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు చేపట్టనున్న కాంట్రాక్టర్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగాలను సమన్వయం చేయడానికి కన్సల్టెన్సీ చర్యలు తీసుకోనుంది.

ప్రాజెక్టు వేగవంతానికి ప్రభుత్వ కసరత్తు

మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్ల పనులు, రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో చేపట్టనున్న పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి వేగవంతంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో సర్కారు కసరత్తు చేస్తోంది. జూబ్లీ చెక్‌పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్, ముగ్ధజంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆస్ప్రతి జంక్షన్‌ల రూపురేఖలు పూర్తిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు నిధుల మంజూరు, టెండర్ నోటిఫికేషన్ వంటి పనులు చకచకా జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed