ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కల్యాణ్ శుభవార్త

by srinivas |
ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కల్యాణ్ శుభవార్త
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హస్త కళల విశిష్టతను తెలిపే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు(Etikoppaka and Kondapalli dolls) రూపొందించే కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) శుభవార్తను అందించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడిసరుకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిందని, చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తన దృష్టికి రావడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. కళాకారులకు అందుబాటులో ఉండేలా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచాలని చెప్పారు. అటవీ ప్రాంతాల్లోనూ... ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలని పవన్ తెలిపారు.

దీంతో అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంపకానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు, మూడు తరాలకు సరిపడా చెట్లను పెంచేలా పి.ఆర్. అండ్ ఆర్.డి. సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పి.ఆర్. అండ్ ఆర్.డి. కమిషనర్ కృష్ణ తేజ ఆదేశాలు విడుదల చేశారు.

Advertisement

Next Story