ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి

by GSrikanth |   ( Updated:2023-07-04 10:41:24.0  )
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు దగ్గుబాటి పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర బాధ్యతలను పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే, అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర బాధ్యతలను దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ హైకమాండ్ అప్పగించింది. దగ్గుబాటి పురంధేశ్వరికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించడంతో నందమూరి అభిమానులు, ఏపీ బీజేపీ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది.

రాజకీయ నేపథ్యం

దగ్గుబాటి పురంధరేశ్వరి 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాపట్ల లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దివంగత ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు పొందిన దగ్గుబాటి పురంధేశ్వరికి మెుదటి సమయంలోనే జాక్ పాట్ కొట్టేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. అయితే 2009లో బాపట్ల ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఈసారి బాపట్ల నుంచి కాకుండా విశాఖపట్టణం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. దీంతో కేంద్రమంత్రిగా పురంధేశ్వరికి మళ్లీ అవకాశం ఇచ్చారు. మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పురంధేశ్వరి పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో దారుణంగా తయారైంది. మళ్లీ ఏపీలోకాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పురంధేశ్వరి ఓడిపోయినప్పటికీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జిగా నియమించారు. 2019 ఎన్నికల అనంతరం 2020లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

అనుభవం కలిసొచ్చేనా?

సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై చర్చ జరిగింది. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలో అనేదానిపై రాష్ట్ర నాయకత్వంతోపాటు బీజేపీ జాతీయ నాయకత్వం సైతం తలలు పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు సామాజిక సమీకరణాలు సైతం పరిగణలోకి తీసుకుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలనే ప్రతిపానదలు సైతం అందాయి. అయితే కేంద్రమంత్రిగా రెండుసార్లు పనిచేసిన పురంధేశ్వరివైపు అధిష్టానం మెుగ్గు చూపింది. కేంద్రమంత్రిగా పనిచేయడంతోపాటు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో అభిమానించే నందమూరి తారక రామారావు కుమార్తె కావడంతో పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుందని పార్టీ నిర్ణయానికి వచ్చింది. రాజకీయాల్లో వివాదాలకు దూరంగా ఉంటూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం దగ్గుబాటి పురంధేశ్వరి స్టైల్. రాష్ట్ర నాయకత్వంతోపాటు జాతీయ రాజకీయాల్లో సైతం దగ్గుబాటి పురంధేశ్వరిది అందెవేసిన చెయ్యి. అందులోనూ మహిళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే అది పార్టీకి ప్లస్ గా మారే అవకాశం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మకు బీజేపీ రథసారథి బాధ్యతలను అగ్రనాయకత్వం అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed