కాకినాడ పార్లమెంటు తలుపు తట్టేదెవరు ?

by samatah |
కాకినాడ పార్లమెంటు తలుపు తట్టేదెవరు ?
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా టీడీపీ నుంచి సీటు ఎవరిని వరిస్తుందోననే సస్పెన్స్ నెలకొంది. ఆశావహులు పెరుగుతుండడంతో టీడీపీ టికెట్ కు డిమాండ్ ఏర్పడింది. తాజాగా కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ రంగంలోకి దిగారు. మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పూజలు జరుపుకొని అనంతరం జిల్లా పెద్దలను కలిసే పనిలో పడ్డారు. తన అభ్యర్థిత్వాన్ని సహకరించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు, సీనియర్ కార్యకర్తల ఆశీస్సులు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ నవీన్ కు విశేష ఆదరణ దక్కుతోంది. దీంతో కాకినాడ పార్లమెంటులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రచారం తలపించే రీతిలో గ్రామగ్రామాన పచ్చ జెండాలు రెపరెపలాడుతున్నాయి. దీంతో వైసీపీలో గుబులు రేగుతోంది.

దూసుకుపోతున్న నవీన్

రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన జ్యోతుల నవీన్ కుమార్ కాకినాడ జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నవీన్ కు బంధు వర్గం ఉంది. కాపు సామాజిక వర్గంలోనూ బంధువులు ఉండటంతోపాటు మిగిలిన సామాజిక వర్గాల్లో మిత్రులు కూడా ఉన్నారు. నవీన్ తండ్రి జ్యోతుల నెహ్రూ సీనియర్ రాజకీయ వేత్త కావడం, దీనికి తోడు అతను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంచి సంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో నవీన్ జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేసి జనంలో ముద్ర వేసుకొన్నారు. తాజాగా అభ్యర్థిత్వం కోసం ప్రతి సీనియర్ కార్యకర్త, పార్టీ నాయకులు ఇంటికి వెళ్లి సహకరించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా ఏడు నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. నవీన్ ఇటీవలే పార్టీ యువనేత నారా లోకేష్ ను కలిసి కొన్ని రోజులపాటు యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు.

వైసీపీలో గందరగోళం

అధికార వైసీపీలో పార్టీలో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఉన్నా, పిఠాపురం అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే అక్కడి సీటు సిట్టింగ్ శాసన సభ్యుడు పెండెం దొరబాబుకు ప్రకటించారు. దీంతో గీతకు పిఠాపురం నో చాన్స్ అని చెప్పాలి. అయితే గీత మళ్లీ కాకినాడ పార్లమెంటు సీటునకు పోటీ చేస్తారా లేక ఏదైనా అసెంబ్లీకి పోటీ చేస్తారా అనేది స్పష్టత లేదు. అయితే ఈ సారి కాకినాడ పార్లమెంటుకు రూరల్ శాసన సభ్యుడు కన్నబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ కాకినాడ పార్లమెంటు అభ్యర్థిత్వం పట్ల గందరగోళంలో నెలకొంది. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story