తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు: ఏపీలో ఆ పార్టీ ఓటమి ఖాయమా?

by Seetharam |   ( Updated:2023-12-04 10:20:05.0  )
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు:  ఏపీలో ఆ పార్టీ ఓటమి ఖాయమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉండబోతుందా? ఏపీ రాజకీయాలను తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయా? తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీలో టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల తీర్పువెలువడే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఏపీలో వైఎస్ జగన్‌కు వార్నింగ్ బెల్స్ మోగినట్లేనని రాజకీయంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రభావం ఖచ్చితంగా ఏపీలోని టీడీపీపై పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ప్రధాన కారణం కాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ కొట్టిపారేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తమ పార్టీకి సంబంధం ఏమిటని నిలదీస్తోంది.

జగన్‌‌పై కేసీఆర్ ఆశలు

ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నట్లు తెలుగు రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరుగు పొరుగు రాష్ట్రాలు కావడంతో ఇచ్చిపుచ్చుకోవడం సహజం. అయితే 2014లో ఎన్నికలు ముగియగానే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఏపీలో టీడీపీ గెలిచింది. అయితే ఈ ఫలితాల అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని.. ఆంధ్రాలో జగన్ గెలుస్తున్నాడని ఆశించినట్లు తెలిపారు. తాము అనుకున్నది జరగలేదని పెదవి విరిచారు. అదే ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో సైతం పోటీ చేసిన సంగతి తెలిసిందే. దాని ప్రభావం తెలంగాణ కాంగ్రెస్‌పై పడింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్..తెచ్చింది కాంగ్రెస్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లినా వర్కౌట్ కాలేదు. కాంగ్రెస్ పరాజయం పాలవ్వడం.. బీఆర్ఎస్‌ అధికారంలోకి రావడం కలిసొచ్చింది. వైసీపీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి కాంగ్రెస్‌ పార్టీకి మైనస్‌గా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇంతలో జగన్ గెలుస్తాడని అనుకున్నానని కేసీఆర్ ప్రకటించడంతో ఇద్దరి మధ్యఏదో ఒప్పందం ఉందనే ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్

ఇకపోతే 2018 ఎన్నికల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకోసం టీడీపీ ప్రయత్నాలు చేసింది. ఇందుకు సంబంధించి కేటీఆర్ పలుమార్లు చంద్రబాబు తమకు ప్రతిపాదనలు పంపినట్లు పదేపదే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ప్రపోజల్స్‌ను కేసీఆర్ తిరస్కరించడం జరిగింది. అనంతరం కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడును ఓ విలన్‌గా కేసీఆర్ అండ్ టీం చిత్రీకరించింది. కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ప్రభావం ఉంటుందని కేసీఆర్ విపరీతంగా ప్రచారం చేశారు. ఇది బాగా స్ప్రెడ్ అయ్యింది. టీడీపీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఓటమిపాలైంది. నాడు తమ పార్టీని ఓడించేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పదేపదే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల్లో కేసీఆర్ సాయం

ఏపీలో 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం వైఎస్ జగన్‌కు విపరీతమైన సహకారం అందించారని ఇప్పటికీ రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. కేసీఆర్ సాధ్యమైనంత వరకు ఆర్థిక సాయం చేశారని ప్రచారం. అంతేకాదు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులు ఏపీకి వెళ్లి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అనంతరం ఏపీలో వైసీపీ విజయదుందుభి మోగించడం చకచకా జరిగిపోయాయి. వైఎస్ జగన్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు రాగా ఆయనకు కేసీఆర్ నుంచి సాదర స్వాగతం లభించింది. 2014 నుంచి ఇరు పార్టీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇప్పటి వరకూ ఇరు పార్టీలు దాదాపుగా అదే తరహా సంబంధాలను కొనసాగిస్తున్నాయి. కేసీఆర్ మోడీతో విబేధించినప్పటికీ.. జగన్ మోడీ సర్కారుకు అండగా నిలిచినప్పటికీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యతలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొనలేదు. ఇప్పటికీ ఇరువురి మధ్య సత్సంబంధాలే నడుస్తున్న సంగతి తెలిసిందే.


చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్

2014 ఎన్నికలప్పటి నుంచి అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీలు చంద్రబాబు నాయుడుని కామన్ ఎనిమీగా భావిస్తోంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడును భావించిన కేసీఆర్, వైఎస్ జగన్‌లు ఇరువురు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మిత్రులుగా వ్యవహరించారు. రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం అంటూనే తెరవెనుక రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అంతా స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం భిన్నంగా స్పందించారు. కేటీఆర్ తమకేం సంబంధం అంటూ మాట్లాడారు. కనీసం సానుభూతి కూడా చూపించకుండా మాట్లాడారు. అంతేకాదు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది. ఈ వ్యవహారం టీడీపీ ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు తమ నేతను జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పుండుమీద చల్లిన కారం మాదిరిగా టీడీపీ భావించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఓ వరంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్న టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ వైపు మెుగ్గుచూపారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సోషల్ మీడియాలో అత్యధికంగా పోస్టులు చేశారు. చంద్రబాబుపై చేసిన కామెంట్స్‌ను విపరీతంగా షేర్ చేశారు. ఈ ప్రభావ కాంగ్రెస్ గెలుపునకు..బీఆర్ఎస్ ఓటమి కారణంగా మారింది. కాంగ్రెస్ గెలుపు అనంతరం టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమకు 2019లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్‌కు ఇప్పుడు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు.

ఏపీపై ప్రభావం చూపేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫలితాలు ఏపీలో టీడీపీ పుంజుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాజకీయంగా ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఎలాగైతే తెలంగాణకు ఉపయోగపడిందో అలాగే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీలో టీడీపీకి కలిసొస్తుందని..వైసీపీకి ప్రతికూలంగా మారబోతుందని ప్రచారం జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో ఇప్పటికే చంద్రబాబు జైలుకెళ్లి బయటకొచ్చారు. దీంతో చంద్రబాబుపై విపరీతమైన సానుభూతి ఉంది. తాజాగా తెలంగాణలో జగన్‌కు సహకరించే బీఆర్ఎస్ ఓడిపోవడంతో అది మరింత కలిసి వస్తోందని టీడీపీ భావిస్తోంది.


రిటర్న్ గిఫ్ట్ అంటూ టీడీపీ సెటైర్లు

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం వైఎస్ జగన్ తెలంగాణ కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాక్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎలాంటి ఆతృత, ఉత్సాహం లేవని చెప్పుకొచ్చారు. తాజాగా కృష్ణాజిల్లా వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకొని, కాంగ్రెస్‌కు పట్టం కట్టారని.. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలా.....బీఆర్ఎస్ ఓటమిపై టీడీపీ హడావిడి చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఇచ్చినట్లే 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడని టీడీపీ సైకోలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల చేసిన త్యాగాలు కాంగ్రెస్ గెలుపుకు ఓ కారణం అంటూ ఖాళీ వివరణ ఇచ్చారు. వైఎస్ షర్మిల ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితాలు తారుమారు అయ్యేవి అని చెప్పుకొచ్చారు. ఎన్నికలు జరిగినన్ని రోజులు ఇంట్లో కూర్చున్న చంద్రబాబు.... ఫలితాలు వచ్చిన తర్వాత తన వల్లే కాంగ్రెస్ గెలిచిందంటూ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జనసేన కార్యకర్తలు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed