ఉత్కంఠ రేపుతోన్న సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్

by Nagaya |   ( Updated:2023-05-26 13:21:48.0  )
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ ఢిల్లీకి బయలు దేరనున్నారు. ఈనెల 27న ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతిఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ‌లపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది.

నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగం గురించి ఇప్పటికే అధికారులు నోట్‌ తయారు చేసినట్లు సమాచారం. వీటితోపాటు నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతిపైనా సీఎం జగన్ ప్రత్యేకంగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగిస్తారని టాక్. అంతేకాదు శనివారం ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, విభజన హామీల అమలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ఎంపీలతో కలిసి పాల్గొంటారని తెలుస్తోంది.

అవినాశ్ కోసమేనంటున్న టీడీపీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ భగ్గుమంటుంది. ఈ పర్యటన వ్యక్తిగతం కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదని విమర్శిస్తుంది. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపిస్తుంది. వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కేంద్రం వద్ద మోకరిల్లేందుకు సీఎం జగన్ ఢిల్లీ పర్యటిస్తున్నారని మండిపడుతుంది. వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ హత్యకేసులో పాత్రధారి అయితే సూత్రధారి వైఎస్ జగన్ అని టీడీపీ ఇప్పటికే ఆరోపిస్తోంది. ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయితే తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మెుదలవ్వడం ఖాయమని టీడీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజకీయ కోణం సైతం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ కోణం కూడా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ జనసేనతో కలిసి వెళ్లాలని యోచనలో ఉంది. ఇకపోతే పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతో కూడా కలిసి వెళ్లాలని బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ భేటీ అవుతారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Also Read...

Amaravati: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed