తోడేళ్లన్నీ ఏకమయ్యాయి.. పొత్తులపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
తోడేళ్లన్నీ ఏకమయ్యాయి.. పొత్తులపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పొత్తులపై సీఎం జగన్ నంద్యాల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒంటరిగా ఎన్నికలు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ పొత్తుకు కాంగ్రెస్ కూడా తోడయ్యిందని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబుల్ సెంచరీ కొట్టేలా ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. మోసాల చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. మూడు రాజధానులు, కొత్తగా రాష్ట్రంలో మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రబాబు14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. తాను చేసినన్ని అభివృద్ది పనులు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న వ్యాఖ్యలు గుర్తు కొస్తాయని ఎద్దేవా చేశారు. 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలు 99 శాతం అమలు చేశామని జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఓటు వేయొద్దని.. వేస్తే పదేళ్లు వెనక్కి వెనక్కి పోతామన్నారు. ఓటు వేసే ముందు చంద్రబాబు, జగన్ పాలనపై ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను గతంలో చూశామని, మళ్లీ నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలన్నారు. వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు ముందుకు వెళ్తామని చెప్పారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఒక్కసారి ఈ ఐదేళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని సూచించారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు. లంచాలు, వివక్ష లేని పరిపాలన చేశామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed