విద్యాశాఖలో కొనసాగుతోన్న కుల వివక్ష.. మనిషిని బట్టి పనిష్మెంట్

by Disha Web Desk 1 |
విద్యాశాఖలో కొనసాగుతోన్న కుల వివక్ష.. మనిషిని బట్టి పనిష్మెంట్
X

దిశ, కరీంనగర్ బ్యూరో: విద్యా బుద్ధులు నేర్పించి విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన విద్యాశాఖలో కుల వివక్ష కలకలం రేపుతోంది. ఓ ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురికాగా వారిని తిరిగి నియమించడంలో విద్యాశాఖ అధికారి వింత వైఖరి విస్మయానికి గురిచేస్తోంది. సస్పెండ్ అయిన ముగ్గురిలో ఇద్దరిని యథాస్థానంలో కొనసాగిస్తూ దళిత ఉపాధ్యాయుడిని మాత్రం మారుమూల ప్రాంతానికి బదిలీ చేయడం కలకలం రేపుతోంది. వివక్షతో వింత వైఖరి ప్రదర్శిస్తున్న విద్యాశాఖ అధికారి తీరు‌పై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటూ ఆందోళన బాటపట్టడంతో కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో వివాదం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా విద్యా శాఖలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న పోరెడ్డి దామోదర్‌రెడ్డి, చంద్రశేఖర్, పోతన శ్రీనివాస్ ఎస్‌ఎస్‌సీ మూల్యాంకన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ శాఖ అధికారులు వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వారి విధుల నుంచి తొలగిస్తూ తిరిగి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడంలో అధికారుల తీరు వివాదస్పదంగా మారింది. కులవివక్ష చూపిస్తూ అగ్రవర్ణాలైన చంద్రశేఖర్, దామోదర్ రెడ్డిలను యథా స్థానంలోనే పోస్టింగ్ ఇవ్వగా.. దళితుడైన శ్రీనివాస్‌ను మాత్రం మారుమూల గ్రామానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది.

దళితుడు కావడమే ఆ ఉపాధ్యాయుడు చేసుకున్న పాపమా.. ఉపాధ్యాయ సంఘ నాయకుడు కాకపోవడమే అతని పాలిట శాపమా? ఉన్నత సామాజిక వర్గాల వారికి ఒక న్యాయం, దళితుల పట్ల మరొక న్యాయమా? అని దళిత ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షల విధుల్లో, స్పాట్ విధుల్లో అలసత్వం పేరుతో సస్పెండ్ చేసిన విద్యాధికారి తనకు నచ్చిన తీరుగా వ్యవహరించడం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. వ్యక్తిగత కక్షలు పెట్టుకుని సదరు అధికారి వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు. కనీసం నియమ నిబంధనలు పాటించకపోవడం విడ్డూరంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉండగా చేయడం చర్చకు తావు ఇస్తున్న అంశం కాగా, అందరి మీద అధికార ప్రతాపం ప్రదర్శించి అడ్డగోలుగా వ్యవహరించాలని చూస్తున్న విద్యాధికారి వ్యవహారంపై అధికార యంత్రాంగం ఇప్పటికైనా గుర్తించి దళిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను యథా స్థానానికి బదిలీ చేయాలని, లేదంటే దళిత సంఘాలు ఆందోళన చేపడుతామంటూ అట్రాసిటీ కేసు పెట్టి ఆ అధికారిని సస్పెండ్ చేసేవరకు ఊరుకునేదే లేదని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.



Next Story